IPL 2022: పాత రికార్డులు చెరిపేసిన కేకేఆర్.. తొలిమ్యాచ్‌లో చెన్నైని చిత్తుచేసిన అయ్యర్ సేన
- ఆల్‌రౌండర్ ప్రతిభ కనబరిచిన కేకేఆర్
- చెన్నైపై విజయాలను 9కి పెంచుకున్న వైనం
- ధోనీ ధనాధన్ షో
- పేలవ ప్రదర్శనతో ఓటమి పాలైన చెన్నై
ఐపీఎల్‌లో భాగంగా గతరాత్రి చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ విజయం సాధించి చరిత్రను తిరగ రాసింది. గతేడాది ఫైనల్‌లో జరిగిన పరాభవానికి ప్రతీకారం తీర్చుకుంది. ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించి ఐపీఎల్‌లో బోణీ చేసింది. ఇప్పటి వరకు ఈ రెండు జట్లు 25 సార్లు తలపడగా చెన్నై 17సార్లు విజయం సాధించింది. కేకేఆర్ 8సార్లు మాత్రమే చెన్నైపై గెలవగలిగింది. దీంతో ఈసారి కూడా చెన్నైదే విజయమని అందరూ భావించారు. కానీ, కొత్త కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ సారథ్యంలోని కేకేఆర్ జట్టు ఆల్‌రౌండర్ షోతో అదరగొట్టింది.
తొలుత టాస్ గెలిచిన కేకేఆర్ ప్రత్యర్థికి బ్యాటింగ్ అప్పగించి తెలివైన పనిచేసింది. ముంబై పిచ్‌పై తొలి ఓవర్లలో బంతి స్వింగ్ అవుతుంది కాబట్టి కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ మరోమాటకు తావులేకుండా చెన్నైకి బ్యాటింగ్ అప్పగించాడు. తొలి ఓవర్లలో పిచ్ నుంచి అందే సహకారాన్ని బౌలర్లు చక్కగా వినియోగించుకున్నారు. ఫలితంగా కేకేఆర్ బౌలర్లను ఎదుర్కోవడం చెన్నైకి కష్టమైంది.
దూసుకొస్తున్న పదునైన బంతులను ఎదుర్కోలేక వికెట్లు సమర్పించుకున్నారు. మరోవైపు, పరుగులు కూడా రాకపోవడంతో చెన్నై ఒత్తిడిలోకి జారిపోయింది. చివరిలో ధోనీ మునుపటి ఆటతీరును ప్రదర్శిస్తూ 38 బంతుల్లోనే 7 ఫోర్లు, సిక్సర్‌తో 50 పరుగులు చేయడంతో 5 వికెట్ల నష్టానికి 131 పరుగుల గౌరవ ప్రదమైన స్కోరు చేయగలిగింది. రాబిన్ ఉతప్ప 28, రాయుడు 15, కెప్టెన్ రవీంద్ర జడేజా 26 పరుగులు చేశారు. ఉమేశ్ యాదవ్ 2 వికెట్లు తీసుకోగా, చక్రవర్తి , రసెల్ చెరో వికెట్ తీసుకున్నారు.
ఐపీఎల్‌లో నేడు రెండు మ్యాచ్‌లు జరగనున్నాయి. ఢిల్లీ కేపిటల్స్-ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్-రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడనున్నాయి.