IPL-2022: ఐపీఎల్ 15వ సీజన్ కు సర్వం సిద్ధం... నేడు ప్రారంభ మ్యాచ్ లో చెన్నై వర్సెస్ కోల్ కతా
- అభిమానులకు క్రికెట్ పండుగ
- ఈసారి 10 జట్లతో ఐపీఎల్
- మ్యాచ్ లన్నీ ముంబయి, పూణే నగరాల్లో నిర్వహణ
- ఆటగాళ్లను తరలించేందుకు గ్రీన్ కారిడార్లు
క్రికెట్ అభిమానులను ఈ వేసవిలో ఉర్రూతలూగించేందుకు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) వచ్చేసింది. ఐపీఎల్ 15వ సీజన్ నేడు ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్ లో డిఫెండింగ్ చాంప్ చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కోల్ కతా నైట్ రైడర్స్ తో తలపడనుంది. ఈ మ్యాచ్ కు ముంబయిలోని వాంఖెడే మైదానం ఆతిథ్యమిస్తోంది. ఈసారి ఐపీఎల్ పోటీలు ముంబయి, పూణే నగరాల్లోనే నిర్వహించనున్నారు.
ఈసారి ఐపీఎల్ లో అహ్మదాబాద్ (గుజరాత్ టైటాన్స్), లక్నో (లక్నో సూపర్ జెయింట్స్) జట్లు కూడా ఆడుతుండగా, ఫ్రాంచైజీల సంఖ్య 10కి పెరిగింది. ఈ జట్లన్నింటికీ ముంబయిలోని వివిధ హోటళ్లలో బస ఏర్పాటు చేశారు. అయితే, ముంబయిలో క్రికెట్ మైదానాలకు, ఆటగాళ్లు బస చేస్తున్న హోటళ్లు చాలా దూరంలో ఉన్నాయి. దాంతో, ఆటగాళ్లను మైదానం వద్దకు తరలించేందుకు ప్రత్యేకంగా గ్రీన్ కారిడార్లు ఏర్పాటు చేశారు.
ఆటగాళ్లను తరలించే వాహనాలు ట్రాఫిక్ లో చిక్కుకోకుండా ఈ గ్రీన్ కారిడార్లు ఉపకరిస్తాయి. ఇందుకోసం వెయ్యి మందికి పైగా పోలీసులను వినియోగిస్తున్నారు. ప్రతి జట్టుకు పోలీసు ఎస్కార్ట్ కల్పిస్తున్నట్టు ముంబయి ట్రాఫిక్ పోలీసు విభాగం వెల్లడించింది. అదే సమయంలో, సాధారణ ప్రజలకు ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా, వారిని ఇతర మార్గాల్లోకి మళ్లిస్తామని పేర్కొంది. కాగా, ఈ సీజన్ లో ఐపీఎల్ ను టాటా గ్రూప్ స్పాన్సర్ చేస్తోంది.