- ప్రజా సంక్షేమానికి మా ప్రభుత్వం పెద్ద పీట వేస్తోంది
- అనేక సంక్షేమ పథకాలను తీసుకొచ్చాం
- మిషన్ కాకతీయ వల్ల భూగర్భ జలాలు పెరిగాయన్న తలసాని
దళితులు ఆర్థికంగా ఎదిగేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ దళితబంధు పథకాన్ని ప్రారంభించారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ప్రజా సంక్షేమానికి తమ ప్రభుత్వం పెద్ద పీట వేస్తోందని చెప్పారు. అనేక సంక్షేమ పథకాలను తమ ప్రభుత్వం తీసుకొచ్చిందని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను తమ కోసం అమలు చేయాలని ఇతర రాష్ట్రాల ప్రజలు ఆయా ప్రభుత్వాలను కోరుతున్నారని తెలిపారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడ్డారని తలసాని అన్నారు. తాగునీరు, వ్యవసాయానికి సరిపడా నీళ్లు కూడా లేవని చెప్పారు. విద్యుత్ సరఫరాలో కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నామని తెలిపారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం నీటి పారుదల రంగంపై ప్రత్యేక దృష్టిని సారించిందని... పలు ప్రాజెక్టులను నిర్మించిందని చెప్పారు. మిషన్ కాకతీయ కార్యక్రమం వల్ల భూగర్భ జలాలు పెరిగాయని తెలిపారు.