AP Assembly Session: చట్ట సభా?.. భజన సభా?: సీపీఐ రామకృష్ణ
- ప్రభుత్వ వైఫల్యాల నిలదీతకు అవకాశమే లేదు
- 1953 నుంచి ఇప్పటిదాకా ఇంత ఘోరంగా సభ ఎప్పుడూ జరగలేదు
- విపక్షాన్ని తిట్టేందుకే సమావేశాలన్న సీపీఐ రామకృష్ణ
శుక్రవారంతో ముగిసిన ఏపీ శాసన సభ బడ్జెట్ సమావేశాల తీరుపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శలు గుప్పించారు. చట్టాలు చేయాల్సిన సభలను భజన సభలుగా మార్చేశారంటూ ఆయన వ్యాఖ్యానించారు. ప్రస్తుత అసెంబ్లీ సమావేశాలు సభ హుందాను దిగజార్చాయన్న ఆయన.. 1953 నుంచి 2022 వరకు జరిగిన సమావేశాలలో సభ ఎప్పుడూ ఇంత ఘోరంగా జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రజల సమస్యలు, పరిష్కారంపై ఈ సమావేశాల్లో అసలు చర్చే లేదని ఆయన మండిపడ్డారు. ఏక పక్షంగా నిర్ణయాలు ఆమోదించుకున్న అధికార పక్షం ప్రతిపక్ష సభ్యులను తిట్టడానికే అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేసినట్టుగా కనిపించిందని ఆయన వ్యాఖ్యానించారు.
సమస్యలు పరిష్కరించాలని కోరిన సభ్యులను అరెస్టు చేయించిన అధికార పార్టీ.. ప్రభుత్వ వైఫల్యాలను అడిగే స్వేచ్ఛ కూడా లేకుండా చేసిందని రామకృష్ణ విమర్శించారు. అసెంబ్లీలో ప్రతిపక్ష సభ్యులను సస్పెండ్ చేసిన అధికార పార్టీ సభ్యులు సీఎం భజనలో మునిగిపోయారని ఆయన ధ్వజమెత్తారు.
కోర్టు తీర్పులను కూడా తప్పుబట్టిన అధికార పార్టీ.. రాజ్యాంగ బద్ధంగా నిర్ణయాలు చేస్తే కోర్టుల జోక్యం అవసరం ఉండదు కదా? అన్న విషయాన్ని విస్మరించిందన్నారు. చట్టాలు చేయాల్సిన సభలను భజన సభలుగా మారుస్తారా? అంటూ ఆయన ప్రశ్నల వర్షం కురిపించారు.