Three Capitals: ఏపీ అసెంబ్లీలో మూడు రాజధానులపై చర్చ... ప్రాంతాల మధ్య అసమానతలు ఎక్కువగా ఉన్నాయన్న బుగ్గన
- మూడు రాజధానుల దిశగా వైసీపీ సర్కారు
- ఏర్పాటు తథ్యమని మంత్రుల ప్రకటనలు
- అసెంబ్లీలో చర్చ సందర్భంగా మాట్లాడిన బుగ్గన
- అసమానతలు రూపుమాపాలని రాజ్యాంగంలో ఉందని వెల్లడి
ఏపీకి మూడు రాజధానులు ఏర్పాటు చేయాలని వైసీపీ ప్రభుత్వం గట్టి పట్టుదలతో ఉంది. మూడు రాజధానుల అంశంపై ఈ మధ్యాహ్నం అసెంబ్లీలో చర్చ చేపట్టారు. ఈ సందర్భంగా ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల మధ్య అసమానతలు ఎక్కువగా ఉన్నాయని తెలిపారు. ప్రాదేశిక హక్కులు, ఆదేశ సూత్రాలు చాలా ముఖ్యమైనవని, ప్రాథమిక హక్కులపై రాజ్యాంగంలో స్పష్టత ఉందని అన్నారు. ఒకరి హక్కును మరొకరు లాక్కోరాదని పేర్కొన్నారు.
రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణతో పోల్చితే ఏపీలో తలసరి ఆదాయం పడిపోయిందని బుగ్గన వెల్లడించారు. వార్షిక తలసరి ఆదాయం జిల్లాల వారీగా చూస్తే కృష్ణా జిల్లాలో రూ.2.68 లక్షలు, విశాఖపట్నంలో రూ.2.17 లక్షలు, పశ్చిమ గోదావరిలో రూ.2.04 లక్షలు, తూర్పు గోదావరిలో రూ.1.67 లక్షలు అని వివరించారు. ఈ జిల్లాల్లో తలసరి ఆదాయం భారీగా ఉందని అన్నారు.
కింది నుంచి చూస్తే శ్రీకాకుళం రూ.1.20 లక్షలు, కర్నూలు రూ.1.30 లక్షలు, విజయనగరం రూ.1.30 లక్షలు, అనంతపురం రూ.1.34 లక్షలు, ప్రకాశం జిల్లా రూ.1.39 లక్షలు, కడప రూ.1.46 లక్షలు ఉందని వివరించారు. ఈ అసమానతలు అనేక రంగాల్లో ఉన్నాయని తెలిపారు. స్థూల వ్యవసాయ ఉత్పత్తుల్లోనూ ఇదే తీరు అని బుగ్గన పేర్కొన్నారు. ప్రాంతాల మధ్య అసమానతలను తొలగించాలని రాజ్యాంగంలో స్పష్టం చేశారని వివరించారు. తద్వారా మూడు రాజధానుల ఏర్పాటు అవశ్యకతను నొక్కి చెప్పారు.