Congress: దొంగేదొంగ అన్నట్టుగా టీఆర్ఎస్ ఆందోళనలు చేయడం సిగ్గుచేటు: రేవంత్ రెడ్డి

Revanth Fires On Cenral and Telangana Govt
  • తెలంగాణలో కరెంట్ చార్జీల పెంపుపై ఆగ్రహం
  • గ్యాస్, పెట్రోల్ ధరల పెంపుపై కేంద్రంపైనా మండిపాటు
  • మోదీ, కేసీఆర్ ల తీరు గజదొంగల కన్నా ఘోరంగా ఉందన్న రేవంత్ 
తెలంగాణ, కేంద్ర ప్రభుత్వాలపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మండిపడ్డారు. రాష్ట్రంలో కరెంట్ చార్జీల పెంపునకు ఈఆర్సీ అనుమతినిచ్చిన సంగతి తెలిసిందే. దీంతో డిస్కంలు ఇక పెంపునకు సిద్ధమయ్యాయి. దీనిపై రేవంత్ స్పందించారు. 

పేదల దగ్గర్నుంచి మధ్యతరగతి వరకు ఎవ్వరినీ టీఆర్ఎస్ ప్రభుత్వం వదిలిపెట్టడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అందరికీ ప్రభుత్వం కరెంట్ షాక్ ఇచ్చిందన్నారు. ఇటు కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అనునిత్యం గ్యాస్, పెట్రోల్ వాతలు పెడుతోందని అన్నారు. 

మోదీ, కేసీఆర్ ల తీరు గజదొంగల కన్నా ఘోరంగా ఉందని మండిపడ్డారు. దొంగేదొంగ అన్నట్టుగా పెట్రోల్ ధరల పెరుగుదలపై టీఆర్ఎస్ ఆందోళనలు చేయడం సిగ్గుచేటని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ గద్దె దిగడం ఖాయమన్న అర్థం వచ్చేలా బై బై కేసీఆర్ అంటూ హాష్ ట్యాగ్ జత చేశారు. 

కాగా, రాష్ట్రంలో వచ్చే నెల 1 నుంచి కరెంట్ చార్జీలను పెంచుకోవచ్చంటూ విద్యుత్ పంపిణీ సంస్థల (డిస్కం)కు ఈఆర్సీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇండ్లకు ఒక్కో యూనిట్ పై 50 పైసలు, వాణిజ్య అవసరాలకు యూనిట్ పై ఒక్క రూపాయి పెంచుకునేందుకు ఆమోదం తెలిపింది. వంద యూనిట్లు దాటి ఒక్క యూనిట్ వాడినా.. శ్లాబ్ మార్చి ప్రజలపై చార్జీలను వడ్డించేందుకూ అంగీకారం తెలిపింది.
Congress
Revanth Reddy
TPCC President
KCR
Narendra Modi
TRS
BJP

More Telugu News