Sri Lanka: శ్రీలంకలో దుర్భర పరిస్థితులు.. భారత్‌లోకి శరణార్థుల రాక మొదలు!
- శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం, ఆ వెంటే ఆహార సంక్షోభం
- నానాటికీ తీసికట్టుగా మారుతున్న పరిస్థితులు
- విధి లేని పరిస్థితుల్లో శరణార్ధులుగా మారుతున్న లంక తమిళులు
- ఇప్పటికే తమిళనాడుకు చేరిన 16 మంది
శ్రీలంకలో తలెత్తిన ఆర్థిక సంక్షోభం కారణంగా ఆ దేశంలో దుర్భర పరిస్థితులు నెలకొన్నాయి. ఈ పరిస్థితులు నానాటికీ మరింత తీవ్రతరం అవుతుండగా.. తాజాగా అక్కడ ఆహార సంక్షోభం కూడా తాండవిస్తోందనే చెప్పాలి. ఇలాంటి తరుణంలో ప్రాణాలు అరచేతబట్టుకుని శ్రీలంకలోని తమిళులు శరణార్థులుగా భారత్‌లోకి ప్రవేశిస్తున్నారు. ఇలా ఇప్పటిదాకా లంక సరిహద్దులు దాటి భారత భూభాగంలోని తమిళనాడుకు 16 మంది చేరారు. వీరిలో 8 మంది చిన్నారులున్నారు.
శ్రీలంకలో నెలకొన్న ఆర్థిక సంక్షోభం కారణంగా నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటాయి. ఫలితంగా అక్కడ ఆహార సంక్షోభం కూడా తలెత్తింది. కిలో చికెన్ రూ.1000 పలుకుతుండగా, ఒక గుడ్డు ఖరీదు ఏకంగా రూ.35 దాటిపోయింది. ఇక పెట్రోల్, డీజీల్ డబుల్ సెంచరీ దాటి త్రిబుల్ సెంచరీ దిశగా పరుగులు పెడుతోంది. కిరోసిన్, గ్యాస్ ధరలు కూడా ఆకాశాన్నంటాయి. వెరసి అక్కడ జన జీవనం అస్తవ్యస్తంగా మారిపోయింది.
నానాటికీ తీసికట్టుగా మారుతున్న పరిస్థితులను గమనించిన అక్కడి తమిళులు మెల్లగా భారత్ బాట పడుతున్నారు. తమిళనాడు తీరం రామేశ్వరం, ధనుష్కోటిలకు శ్రీలంక తమిళులు చేరుకున్నారు. మంగళవారం ఉదయం రామేశ్వరానికి ఆరుగురు రాగా.. సాయంత్రానికి పది మందితో కూడిన బృందం వచ్చింది. వీరిని కోస్ట్ గార్డ్ తమ అదుపులోకి తీసుకుంది. శ్రీలంకలో ఇవే పరిస్థితులు కొనసాగితే.. మరింత మంది శరణార్థులు భారత్‌కు వచ్చే అవకాశాలున్నాయన్న వాదనలు వినిపిస్తున్నాయి.