Botsa Satyanarayana: 3 రాజధానులే మా విధానం.. సభలో బిల్లు పెడతాం: బొత్స సత్యనారాయణ
- రాష్ట్ర సమగ్రాభివృద్ధే మా లక్ష్యం
- పాలనా వికేంద్రీకరణకు కట్టుబడి ఉన్నాం
- పార్టీతో పాటు ప్రభుత్వ నిర్ణయం అదేనన్న బొత్స
ఏపీకి మూడు రాజధానులు అన్న విధానానికే తాము కట్టుబడి ఉన్నామని మంత్రి బొత్స సత్యనారాయణ మరోమారు స్పష్టం చేశారు. మంగళవారం నాడు అమరావతిలో మీడియాతో మాట్లాడిన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
రాష్ట్రానికి మూడు రాజధానులు తమ పార్టీ, ప్రభుత్వ విధానమని చెప్పిన ఆయన.. పాలనా వికేంద్రీకరణకు కట్టుబడి ఉన్నామని పేర్కొన్నారు. సమయాన్ని బట్టి సభలో బిల్లు ప్రవేశపెడతామని కూడా ఆయన వెల్లడించారు. మొదటి నుండి మూడు రాజధానుల మాటే చెబుతున్నామన్న బొత్స.. రాష్ట్ర సమగ్ర అభివృద్ధే తమ లక్ష్యమని పేర్కొన్నారు.
ఇతరత్రా అంశాలపైనా స్పందించిన బొత్స.. స్మార్ట్ సిటీ పదవులకు రాజీనామా చేసినవారికి ఇంకా పెద్ద పదవులు ఇస్తామేమో? అని వ్యాఖ్యానించారు. ఉపాధ్యాయ సమస్యలపై ఎమ్మెల్సీలతో చర్చించామనీ... అన్నీ పరిష్కారం అవుతాయని పేర్కొన్నారు. మున్సిపల్ స్కూళ్లలో టీచర్ల సంఖ్య పెంచమని కొన్ని సంఘాలు అడిగాయన్న ఆయన ఆ దిశగానూ చర్యలు తీసుకుంటామన్నారు.