Sirisilla Rajaiah: కోడలి సజీవ దహనం కేసులో నిర్దోషిగా సిరిసిల్ల రాజయ్య
![Sirisilla Rajaiah acquitted in daughter in law live burning case](https://imgd.ap7am.com/thumbnail/cr-20220322tn6239ca6ac9a79.jpg)
- 2015 నవంబర్ 4న రాజయ్య ఇంటిలో అగ్ని ప్రమాదం
- కోడలు, ముగ్గురు మనవలు సజీవ దహనం
- ఘటనపై పలు అనుమానాలు
- కోడలు బంధువుల ఫిర్యాదుతో రాజయ్య కుటుంబంపై కేసు
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, వరంగల్ మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్యకు భారీ ఊరట లభించింది. ముగ్గురు పిల్లలతో కలిసి సహా రాజయ్య కోడలు సారిక ఆయన ఇంటిలోనే సజీవ దహనం అయిన కేసులో రాజయ్యతో పాటు ఆయన కుమారుడు అనిల్, భార్య మాధవి నిందితులుగా ఉన్న సంగతి తెలిసిందే.
2015లో జరిగిన ఈ ఘటన తెలుగు రాష్ట్రాల్లో పెను కలకలమే రేపింది. ఈ కేసును సుదీర్ఘంగా విచారించిన హైదరాబాద్‌లోని ప్రత్యేక కోర్టు మంగళవారం తుది తీర్పు వెలువరించింది. ఈ కేసులో రాజయ్యతో పాటు ఆయన కుమారుడు, భార్య నిర్దోషులేనని కోర్టు తీర్పు చెప్పింది.
ఈ కేసు వివరాల్లోకి వెళితే.. 2015 నవంబర్ 4 తెల్లవారుజామున వరంగల్‌లోని రాజయ్య ఇంటిలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో రాజయ్య కోడలు సారికతో పాటు ఆమె ముగ్గురు పిల్లలు అభినవ్(7), ఆయోన్(3), శ్రీయోన్(3) లు సజీవ దహనమయ్యారు.
ఈ ఘటన జరిగిన తీరుపై పలు అనుమానాలు వ్యక్తమయ్యాయి. సారిక కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు రాజయ్య సహా ఆయన భార్యను, కొడుకును అదుపులోకి తీసుకొని 498ఎ, 306, 176 సెక్షన్ల కింద కేసును నమోదు చేశారు. ఈ కేసు విచారణను నిర్వహించిన నాంపల్లిలోని ప్రత్యేక కోర్టు మంగళవారం తీర్పు చెప్పింది.