Russia: ఆకాశాన్నంటుతున్న ధరలు... చక్కెర కోసం రష్యన్ల వెతలు
- ఉక్రెయిన్ పై రష్యా దాడులు
- ఆంక్షలు విధించిన ప్రపంచ దేశాలు
- మరోవైపు రష్యాలో ద్రవ్యోల్బణం
- నిత్యావసరాలపై తీవ్ర ప్రభావం
రష్యా దాడులకు గురవుతున్న ఉక్రెయిన్ లో ఎలాంటి సంక్షుభిత పరిస్థితులు నెలకొన్నాయో, రష్యాలోనూ క్రమంగా అలాంటి పరిస్థితులే దర్శనమిస్తున్నాయి. అంతర్జాతీయ సమాజం రష్యాపై తీవ్ర ఆంక్షలు విధించడం తెలిసిందే. వివిధ దేశాలు విధించిన ఆంక్షల ప్రభావం దాదాపు రష్యాలోని అన్ని రంగాలపైనా పడింది. కొన్నిచోట్ల నిత్యావసరాలకు సైతం కటకట ఏర్పడింది. అందుకు నిదర్శనమే ఈ ఘటన. సోషల్ మీడియాలో ఇప్పుడో వీడియో వైరల్ అవుతోంది.
ఓ సూపర్ మార్కెట్లో కొందరు రష్యన్లు చక్కెర కోసం ఎగబడడం ఆ వీడియోలో చూడొచ్చు. ద్రవ్యోల్బణం కారణంగా రష్యాలో చక్కెర ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. కొరత కారణంగా చక్కెర అమ్మకాలపై దుకాణదారులు పరిమితి విధించారు. ఒకరికి 10 కేజీల చక్కెర మాత్రమే విక్రయించాలని నిర్ణయించారు. దాంతో, ఓ సూపర్ మార్కెట్లో అందుబాటులో ఉన్న కొన్ని చక్కెర ప్యాకెట్ల కోసం ఎగబడ్డారు. ముసలీముతకా సైతం పోటీలుపడి చేజిక్కించుకున్నారు.
కాగా, రష్యా అధికారులు మాత్రం దేశంలో పంచదారకు కొరత లేదని, ప్రజలు అనవసరంగా ఆందోళనలకు గురవుతున్నారని అంటున్నారు. చక్కెర దొరకదేమోనన్న ఆదుర్దాతో దుకాణాలపై ఎగబడుతున్నారని, అందువల్లే కొన్నిచోట్ల ధరలు మిన్నంటుతున్నాయని, కొన్నిచోట్ల చక్కెర లభ్యం కాని పరిస్థితులు ఏర్పడుతున్నాయని చెబుతున్నారు.