Imran Khan: సొంతపార్టీలో అసమ్మతివాదులపై జీవితకాల నిషేధం అస్త్రాన్ని బయటికి తీస్తున్న పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్!
- అవిశ్వాస తీర్మానం ఎదుర్కొంటున్న ఇమ్రాన్
- ఈ నెల 28న ఓటింగ్ జరిగే అవకాశం
- సొంతపార్టీలో 24 మంది తిరుగుబాటు బావుటా
- ఇమ్రాన్ కు వ్యతిరేకంగా ఓటేస్తామని ప్రకటన
పాకిస్థాన్ లో ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం సంక్షోభంలో చిక్కుకుంది. పాక్ లో నెలకొన్న దారుణ పరిస్థితులకు ప్రధాని ఇమ్రాన్ ఖానే కారకుడు అంటూ విపక్ష సభ్యులు ఈ నెల 8న పార్లమెంటు వద్ద అవిశ్వాస తీర్మానం సమర్పించారు. దీనిపై ఈ నెల 28న ఓటింగ్ జరగవచ్చని భావిస్తున్నారు. అయితే, ఇమ్రాన్ ఖాన్ కు సొంతపార్టీలోనే 'వ్యతిరేక' సెగలు తగులుతున్నాయి. ఇమ్రాన్ కు వ్యతిరేకంగా ఓటు వేస్తామని అధికారపక్షానికి చెందిన 24 మంది ఎంపీలు ప్రకటించారు.
దీనిపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న ఇమ్రాన్ ఖాన్... సొంతపార్టీలో అసమ్మతివాదులపై జీవితకాల నిషేధం విధించేందుకు సిద్ధమయ్యారు. అసంతృప్త సభ్యులను జీవితకాలం పాటు నిషేధించే అంశంపై రాజ్యాంగపరమైన అవకాశాలను తెలియజేయాలని ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
దీనిపై తాజాగా విచారణ చేపట్టిన పాక్ సుప్రీంకోర్టు... మరింత లోతైన విచారణ కోసం ఐదుగురు సభ్యులతో డివిజన్ బెంచ్ ఏర్పాటు చేయనున్నట్టు తెలిపింది. అనంతరం విచారణను ఈ నెల 24కి వాయిదా వేసింది.
కాగా, నేటి విచారణలో వాదనల సందర్భంగా.... పాకిస్థాన్ అటార్నీ జనరల్ రాజ్యాంగంలోని ఆర్టికల్ 63(ఏ)ని ఉదహరించారు. అసమ్మతిసభ్యులను అనర్హులుగా ప్రకటించే అధికారం ప్రభుత్వానికి ఉందని పేర్కొన్నారు. అంతేకాదు, అధికారపక్షంలోని ఈ అసమ్మతివాదులు అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటు వేస్తే, వాటిని పరిగణనలోకి తీసుకోరాదని విజ్ఞప్తి చేశారు. ప్రధానమంత్రికి వ్యతిరేకంగా వచ్చిన ఓట్ల నుంచి వాటిని మినహాయించాలని విన్నవించారు.