ICC Womens World Cup 2022: మహిళల ప్రపంచకప్: బంగ్లాదేశ్‌పై టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్
- గెలిస్తే సెమీస్ రేసులోకి
- మెరుగుపడాల్సిన బౌలింగ్
- ప్రత్యర్థులకు ముచ్చెమటలు పట్టిస్తున్న బంగ్లాదేశ్
మహిళల ప్రపంచకప్‌లో నిలకడలేమితో సతమతమవుతున్న భారత జట్టు మరికాసేపట్లో బంగ్లాదేశ్‌తో తలపడనుంది. టాస్ గెలిచిన భారత కెప్టెన్ మిథాలీ రాజ్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఇప్పటి వరకు ఐదు మ్యాచ్‌లు ఆడి మూడింటిలో ఓడిన మిథాలీ సేన సెమీస్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. కాబట్టి సెమీస్ పోరులో నిలవాలంటే ఈ మ్యాచ్‌లో గెలవకతప్పదు. బ్యాటర్లు రాణిస్తున్నప్పటికీ బౌలర్లు మాత్రం పూర్తి స్థాయిలో రాణించడం లేదు. కాబట్టి బౌలర్లు తమ బంతులకు పదును పెట్టాల్సి ఉంటుంది.
మరోవైపు, నాలుగు మ్యాచ్‌లు ఆడి ఒక్క దాంట్లోనే విజయం సాధించినప్పటికీ ప్రత్యర్థులకు బంగ్లాదేశ్ ముచ్చెమటలు పట్టిస్తోంది. భారత జట్టు సెమీస్‌కు చేరాలంటే నేటి మ్యాచ్‌లో గెలవడంతోపాటు చివరి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాపైనా విజయం సాధించాల్సి ఉంటుంది. ఈ మ్యాచ్‌లో భారత జట్టు ఒకే ఒక్క మార్పుతో బరిలోకి దిగుతోంది. మేఘనా సింగ్ స్థానంలో పూనమ్ యాదవ్ తిరిగి జట్టులోకి వచ్చింది. బంగ్లాదేశ్ జట్టులో మాత్రం రెండు మార్పులు జరిగాయి. ముర్షిదా ఖాతూన్, లతా మండల్ జట్టులోకి వచ్చారు.