KCR: ముంద‌స్తు ముచ్చ‌టే లేదు!... తేల్చేసిన సీఎం కేసీఆర్‌!

cm kcr commnets on pre polls

  • యాసంగి ధాన్యం మొత్తాన్ని కేంద్రం కొనాల్సిందే
  • ఒకే దేశం- ఒకే సేక‌ర‌ణ పద్ధతిని అమ‌లు చేయాలి
  • ప్ర‌శాంత్ కిశోర్ డ‌బ్బులు తీసుకుని ప‌నిచేసే రకం కాదు
  • బీజేపీ బ‌లం త‌గ్గుతుంద‌ని ముందే చెప్పా
  • టీఆర్ఎస్ఎల్పీ భేటీ త‌ర్వాత సీఎం కేసీఆర్‌

తెలంగాణ అసెంబ్లీకి ముంద‌స్తు ఎన్నిక‌లు త‌ప్ప‌వ‌ని,  ఆ దిశ‌గానే టీఆర్ఎస్ అధినేత‌, సీఎం కేసీఆర్ ఆలోచిస్తున్నార‌న్న వార్త‌ల‌కు చెక్ ప‌డిపోయింది. రాష్ట్రంలో ముంద‌స్తు ఎన్నిక‌ల ముచ్చ‌టే లేద‌ని స్వ‌యంగా కేసీఆరే కాసేప‌టి క్రితం ప్ర‌క‌టించారు. ఆరు నూరైనా ముంద‌స్తుకు పోయే ప్ర‌స‌క్తే లేద‌ని, గ‌తంలో అవ‌స‌రం మేర‌కే ముంద‌స్తుకు వెళ్లామ‌ని కేసీఆర్ తెలిపారు. ఈ మేర‌కు టీఆర్ఎస్ఎల్పీ భేటీ ముగిసిన త‌ర్వాత స్వ‌యంగా మీడియాతో మాట్లాడేందుకు వ‌చ్చిన కేసీఆర్‌.. ముంద‌స్తు ఎన్నిక‌ల వార్త‌ల‌కు చెక్ పెట్టేశారు.

మీడియా స‌మావేశంలో ప‌లు కీల‌క అంశాల‌ను ప్ర‌స్తావించిన కేసీఆర్‌.. త‌మ పార్టీ కోసం ప‌నిచేస్తున్న రాజ‌కీయ వ్యూహ‌క‌ర్త ప్ర‌శాంత్ కిశోర్ డ‌బ్బులు తీసుకుని ప‌నిచేసే ర‌కం కాద‌ని పేర్కొన్నారు. గ‌డ‌చిన 8 ఏళ్లుగా త‌న‌కు పీకేతో స్నేహం ఉంద‌ని, త‌న కోరిక మేర‌కే టీఆర్ఎస్ కోసం పీకే ప‌నిచేస్తున్నార‌ని కేసీఆర్ చెప్పారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ఎన్నికల్లో బ‌లం త‌గ్గుతుంద‌ని తాను ముందే చెప్పాన‌ని గుర్తు చేశారు. గ‌తంలో 312 సీట్లు గెలిచిన బీజేపీ.. ఇప్పుడు 255 సీట్ల‌కే ప‌రిమిత‌మైంద‌న్నారు. సీట్ల త‌గ్గుద‌ల దేనికి సంకేత‌మో బీజేపీనే ఆలోచించుకోవాల‌ని కేసీఆర్ వ్యాఖ్యానించారు. 

ధాన్యం సేక‌ర‌ణ‌కు సంబంధించి ఒకే దేశం- ఒకే సేక‌ర‌ణ విధానం ఉండాల‌ని కేసీఆర్ డిమాండ్ చేశారు. ధాన్యం సేక‌ర‌ణ‌లో గ‌తంలోనూ కేంద్రం ఇబ్బందుల‌కు గురి చేసింద‌ని కేసీఆర్ ఆరోపించారు. కనీస మ‌ద్ద‌తు ధ‌ర ఇచ్చేది ధాన్యానికేన‌ని చెప్పిన కేసీఆర్‌.. బియ్యానికి కాద‌న్న విషయాన్ని కేంద్రం గుర్తించాల‌న్నారు. పంజాబ్‌లో ఏ రీతిన ధాన్యాన్ని సేక‌రిస్తున్నారో.. అదే రీతిన తెలంగాణ ధాన్యాన్ని కూడా సేక‌రించాల‌న్నారు. తెలంగాణలో పండ‌బోయే యాసంగి ధాన్యం మొత్తాన్ని కేంద్రం కొని తీరాల్సిందేన‌ని కేసీఆర్ డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News