Vishal: మూడేళ్ల తర్వాత నడిగర్ సంఘం ఎన్నికల ఫలితాలు... సెట్స్ పై సంబరాలు చేసుకున్న విశాల్
- నడిగర్ సంఘం ఎన్నికల ఫలితాలు నేడు వెల్లడి
- నాజర్ బృందం ఘనవిజయం
- ప్రధాన కార్యదర్శిగా పోటీ చేసి నెగ్గిన విశాల్
- ప్రతి హామీ నెరవేర్చుతామని వెల్లడి
- నడిగర్ సంఘం భవన నిర్మాణం కొనసాగిస్తామని స్పష్టీకరణ
నడిగర్ సంఘంగా పేరుగాంచిన సౌత్ ఇండియన్ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (ఎస్ఐఏఏ) ఎన్నికల ఫలితాలు ఎట్టకేలకు వెల్లడయ్యాయి. కోర్టు తీర్పు నేపథ్యంలో మూడేళ్ల తర్వాత నడిగర్ సంఘం ఎన్నికల ఫలితాలు రాగా, నాజర్ టీమ్ ఘనవిజయం సాధించింది. నడిగర్ సంఘం ఎన్నికల్లో ఎలాంటి అక్రమాలు చోటుచేసుకోలేదని కోర్టు స్పష్టం చేసిన నేపథ్యంలో, నిన్న చెన్నైలోని ఓ స్కూల్లో రిటైర్డ్ జడ్జి సమక్షంలో ఓట్లు లెక్కించారు. నాజర్ బృందం 1,701 ఓట్లతో జయభేరి మోగించింది.
ఈ నేపథ్యంలో, తమ 'పాండవర్ అని' ప్యానెల్ గెలవడంతో నటుడు విశాల్ సెట్స్ పైనే సంబరాలు చేసుకున్నారు. ఈ ప్యానెల్ తరఫున విశాల్ ప్రధాన కార్యదర్శిగా పోటీ చేసి గెలుపొందారు. దాంతో ఆయన ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. ప్రస్తుతం ఆయన లాఠీ చిత్రంలో నటిస్తున్నారు. షూటింగ్ గ్యాప్ లో చిత్రబృందంతో కలిసి వేడుక చేసుకున్నారు. కాగా, మూడేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత నడిగర్ సంఘం ఎన్నికల ఫలితాలు వెల్లడైన నేపథ్యంలో విశాల్ ఓ ప్రకటన విడుదల చేశారు.
"నిజాయతీ, కఠోర శ్రమ ఎప్పటికీ విఫలం కావని చరిత్ర చెబుతుంది. ఈ ఎన్నికల్లో విజయం సాధించిన పాండవర్ అని టీమ్ మొత్తానికి కృతజ్ఞతలు చెబుతున్నా. నిజంగా ఈ పోరాటం సుదీర్ఘకాలం సాగింది. చివరికి సత్యమే గెలిచింది. న్యాయవ్యవస్థపై నాకు ప్రగాఢ విశ్వాసం ఉంది. అందుకే మనస్ఫూర్తిగా న్యాయవ్యవస్థకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించినందుకు రిటైర్డ్ జడ్జి పద్మనాభన్ కు ధన్యవాదాలు.
ఈ విజయం మాపై ఎన్నో బాధ్యతలను మోపింది. ప్రతి ఒక్క హామీని చిత్తశుద్ధితో నెరవేరుస్తాం. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి శ్రీ ఎంకే స్టాలిన్ గారికి, మీడియాకు, పోలీస్ డిపార్ట్ మెంట్ కు, ట్రాఫిక్, ఫైర్ అండ్ సేఫ్టీ విభాగానికి, కౌంటింగ్ అధికారులకు, ఈ ఎన్నికలు సజావుగా పూర్తయ్యేందుకు కృషి చేసిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ఇక నడిగర్ సంఘం సొంత భవన నిర్మాణం పూర్తిచేయడంపై దృష్టి సారిస్తాం. తద్వారా మా కలను సాకారం చేసుకుంటాం" అని తన ప్రకటనలో వివరించారు.