Potassium IodideTablets: రష్యా అణుదాడి భయాలు... భారీగా పెరిగిన పొటాషియం అయొడైడ్ మాత్రల అమ్మకాలు
- ఉక్రెయిన్ పై రష్యా తీవ్రస్థాయిలో దాడులు
- ఉక్రెయిన్ లో రసాయనిక, జీవాయుధాలున్నట్టు ఆరోపణలు
- అణ్వస్త్రాలు ప్రయోగించే అవకాశాలున్నాయని నిపుణుల అంచనా
- అమెజాన్ లోనూ పొటాషియం అయొడైడ్ మాత్రలకు గిరాకీ
ఉక్రెయిన్ పై దాడులు ముమ్మరం చేసిన రష్యా మున్ముందు అణుదాడికి దిగే అవకాశాలున్నాయని సర్వత్రా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఉక్రెయిన్ లో రసాయనిక ఆయుధాలు, జీవాయుధాలు అభివృద్ధి చేస్తున్నారంటూ ఇప్పటికే ఆరోపణలు చేసిన రష్యా, అణుదాడికి దిగడానికి గల కారణాలను ముందే సిద్ధం చేసుకుంటోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో, యూరప్ దేశాల్లో పొటాషియం అయొడైడ్ మాత్రల అమ్మకాలు ఒక్కసారిగా పెరిగాయి.
అణుబాంబు విస్ఫోటనం ద్వారా ఉత్పన్నమయ్యే రేడియేషన్ నుంచి పొటాషియం అయొడైడ్ మాత్రలు థైరాయిడ్ గ్రంథికి రక్షణ కల్పిస్తాయి. రేడియో ధార్మిక అయొడిన్ ను థైరాయిడ్ గ్రంథి పీల్చుకోకుండా ఈ మాత్రలు నివారిస్తాయి. ఇప్పుడీ మాత్రల కోసం యూరప్ ప్రజలు అమెజాన్ పోర్టల్ లను కూడా ఆశ్రయిస్తున్నారట. గత కొన్నిరోజుల వ్యవధిలోనే అమెజాన్ లో పొటాషియం అయొడైడ్ మాత్రల అమ్మకాల్లో 50 శాతం పెరుగుదల నమోదైందని ది ఎకనామిస్ట్ మీడియా సంస్థ పేర్కొంది.
కాగా, ఈ మాత్రలతో అణుదాడి నుంచి పూర్తిస్థాయిలో రక్షణ లభించదని నిపుణులు చెబుతున్నారు. కొద్దిమేర రేడియో ధార్మికత నుంచి కాపాడుకోవచ్చేమో కానీ, అణు విస్ఫోటనంలో చిక్కుకుంటే దీంతో ప్రయోజనం ఉండదని పేర్కొన్నారు.
అటు, కొన్ని దేశాల్లో అణు బంకర్లపై ఆసక్తి చూపిస్తున్నారు. కొన్ని మిలియన్ డాలర్ల ఖరీదు చేసే ఈ బంకర్లకు చెందిన వివరాలు తెలుసుకుంటున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోందట.