Telugudesam: పెగాసస్‌పై చర్చించడానికి వీల్లేదు: టీడీపీ ఎమ్మెల్యేలు
- స్పీకర్ తమ్మినేనికి టీడీపీ ఎమ్మెల్యేల లేఖ
- పెగాసస్ అంశంపై సభలో చర్చించడం సరికాదంటూ అభ్యంతరం
- అవాస్తవాలపై సభలో చర్చించడం విడ్డూరంగా ఉందన్న టీడీపీ
ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాంకి టీడీపీ ఎమ్మెల్యేలు లేఖ రాశారు. పెగాసస్ అంశంపై సభలో చర్చించాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోన్న నేపథ్యంలో ఆ అంశంపై చర్చించడం సరికాదంటూ టీడీపీ నేతలు లేఖలో అభ్యంతరాలు తెలిపారు. అవాస్తవాలపై సభలో చర్చించడం విడ్డూరంగా ఉందని టీడీపీ ఎమ్మెల్యేలు అన్నారు.
మరోవైపు, అసెంబ్లీ నుంచి సస్పెండ్ అయిన తర్వాత టీడీపీ నేతలు మీడియాతో మాట్లాడారు. పెగాసస్ వ్యవహారాన్ని తమ పార్టీకి అంటగట్టి వైసీపీ విమర్శలు చేయటం సిగ్గుచేటని గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. ఏపీలో మద్యం, సారా వల్ల వందలాది మంది మృతి చెందారని విమర్శించారు. దానిపై చర్చ జరిపితే ప్రభుత్వానికి వచ్చే మద్యం ఆదాయం తగ్గుతుందనే భయం వల్లే పెగాసస్‌పై అసత్యాలు చెబుతున్నారని ఆయన అన్నారు.
టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మాట్లాడుతూ... పెగాసెస్‌పై అసెంబ్లీలో చర్చ చేపడతామని అనడం ఏంటని ప్రశ్నించారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కేంద్ర ప్రభుత్వం పెగాసస్ సాఫ్ట్‌వేర్‌ను కొనుగోలు చేసిందని సుప్రీంకోర్టుకు వెళ్లిన సమయంలో పార్లమెంటులో చర్చ పెట్టారని, ఆ సమయంలో వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి కేసులకు భయపడి చర్చ జరగకూడదని అన్నారని గుర్తు చేశారు.
ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్.. చంద్రబాబు నాయుడిపై బురద చల్లడానికి మమతా బెనర్జీతో పెగాసస్‌పై ఇటీవల మాట్లాడించారని ఆయన అన్నారు. చంద్రబాబు మీద బురద చల్లుతామంటే తాము చూస్తూ ఊరుకోబోమని ఆయన చెప్పారు. వైసీపీకి తగిన విధంగా బుద్ధి చెబుతామని అన్నారు.