Vladimir Putin: ఇటీవల వెయ్యి మంది సిబ్బందిని తొలగించిన పుతిన్... కారణం అదేనా?
- ఇటీవల అమెరికా సెనేటర్ గ్రాహమ్ సంచలన వ్యాఖ్యలు
- ఒకర్ని చంపితే యుద్ధం ఆగిపోతుందని వెల్లడి
- పుతిన్ పై విష ప్రయోగానికి ఏ దేశం సాహసించదన్న గ్రాహమ్
- అధ్యక్ష కార్యాలయంలోని వారే ఆ పనిచేస్తారని వ్యాఖ్యలు
ఉక్రెయిన్ పై రష్యా దండయాత్ర నేపథ్యంలో, ఇటీవల అమెరికా సెనేటర్ లిండ్సే గ్రాహమ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ యుద్ధం ముగియాలంటే అందుకు ఒకటే మార్గం ఉందని, ఒకరి చావుతోనే యుద్ధం ముగుస్తుందని అన్నారు. అయితే పుతిన్ పై విషప్రయోగం చేసేందుకు ఏ దేశం సాహసించకపోవచ్చని, బహుశా ఆ పని రష్యా అధ్యక్ష కార్యాలయంలోని వారే చేసే అవకాశాలున్నాయని తెలిపారు.
మరి ఈ వ్యాఖ్యల ఫలితమో, లేక నిఘా వర్గాల హెచ్చరికలో తెలియదు కానీ, ఇటీవల పుతిన్ వెయ్యి మంది సిబ్బందిని తొలగించినట్టు వార్తలొస్తున్నాయి. వారిలో అత్యధికులు బాడీగార్డులు, వంటవాళ్లు, పర్సనల్ సెక్రటరీలు, లాండ్రీ సిబ్బంది ఉన్నారట. ఇక వీళ్ల స్థానంలో తీసుకున్న కొత్తవాళ్లను అన్ని విధాలా పరీక్షించి, వారిపై నిశితంగా విచారణ జరిపి ఎంపిక చేశారని వెల్లడైంది.
ఉక్రెయిన్ పై దాడి చేసిన రోజు నుంచే ప్రపంచంలోని అత్యధిక దేశాలు పుతిన్ కు వ్యతిరేకంగా మారాయి. దేశాలే కాదు, వాణిజ్య సంస్థలు, ఎలాన్ మస్క్ వంటి అపర కుబేరులు సైతం తీవ్ర స్వరం వినిపిస్తున్నారు.