Art School: 400 మంది తలదాచుకున్న ఆర్ట్ స్కూల్ బిల్డింగ్ పై రష్యా దాడి

Russia continues attacks on Ukraine as latest bombing on Art School in Marupol

  • ఉక్రెయిన్ పై దాడులు ముమ్మరం చేసిన రష్యా
  • మేరియుపోల్ నగరంపై మరోసారి బాంబుల వర్షం
  • చరిత్రలో మర్చిపోలేని విధ్వంసమన్న జెలెన్ స్కీ
  • రష్యాతో సంబంధాల పునరుద్ధరణ తప్పిదమే అవుతుందన్న బోరిస్

ఉక్రెయిన్ పై రష్యా విచక్షణ రహితంగా దాడులకు పాల్పడుతోంది. ఎలాగైనా ఉక్రెయిన్ నగరాలను చేజిక్కించుకోవాలన్న పంతంతో ముందుకు కదులుతున్న రష్యా సేనలు, ప్రజలు తలదాచుకుంటున్న భవనాలను కూడా నేలమట్టం చేస్తున్నాయి. తాజాగా మేరియుపోల్ నగరంలో 400 మంది ఆశ్రయం పొందుతున్న ఓ ఆర్ట్ స్కూల్ భవనంపై రష్యా దాడులు చేసింది. 

రష్యా టార్గెట్ లిస్టులో మేరియుపోల్ నగరం కూడా ఉంది. రాజధాని కీవ్ కంటే ముందే మేరియుపోల్ ను చుట్టుముట్టిన రష్యన్ బలగాలు తీవ్ర విధ్వంసం సృష్టించాయి. ఇప్పటికీ అక్కడ దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. తాజా దాడుల నేపథ్యంలో, మేరియుపోల్ అధికార వర్గాలు స్పందిస్తూ, దాడుల కారణంగా ప్రజలు శిథిలాల మధ్యనే ఉండిపోయారని వ్యాఖ్యానించాయి. రేవు పట్టణమైన మేరియుపోల్ లో రష్యా సృష్టించిన విధ్వంసం శతాబ్దాలు గడచినా మర్చిపోలేనిదని ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్ స్కీ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. చెర్నివ్ నగరంలోని ఓ ఆసుపత్రిపై జరిగిన దాడిలో పదుల సంఖ్యలో ప్రజలు మరణించారని నగర మేయర్ వెల్లడించారు. 

కాగా, రష్యా మూర్ఖత్వంతో యుద్ధం చేస్తోందంటూ స్విట్జర్లాండ్ అధ్యక్షుడు ఇగ్నాజియో కాసిస్ అన్నారు. అయితే తాము ఉక్రెయిన్ ప్రజాస్వామ్యం, స్వాతంత్ర్యాలకు మద్దతు ఇస్తున్నందున ఎదురయ్యే పరిణామాలు ఎలాంటివైనా మూల్యం చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నామని అన్నారు. 

బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ స్పందిస్తూ, ఉక్రెయిన్ పై దురాక్రమణకు దిగిన రష్యాతో సంబంధాలు పునరుద్ధరించుకోవాలని చూస్తే అది తప్పిదమే అవుతుందని స్పష్టం చేశారు. 2014లో తాము చేసింది తప్పిదమేనని అంగీకరించారు. రష్యా 2014లో ఉక్రెయిన్ భూభాగం క్రిమియాను బలవంతంగా ఆక్రమించుకోవడం తెలిసిందే. దీన్ని ఉద్దేశించే బోరిస్ జాన్సన్ తాజా వ్యాఖ్యలు చేశారు.

  • Loading...

More Telugu News