Imran Khan: రాజీనామాకు వెనుకాడేది లేదు... మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్న పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్!

Imran Khan faces Resolution of disbelief

  • రేపు దిగువసభలో విపక్షాల అవిశ్వాస తీర్మానం
  • పదవీ గండం ఎదుర్కొంటున్న ఇమ్రాన్
  • సైనికాధికారులతో చర్చలు విఫలం
  • సాయం చేయలేమన్న సైన్యం
  • భారత్ సైన్యం గొప్పదంటూ ఇమ్రాన్ వ్యాఖ్యలు

పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సంక్షోభంలో చిక్కుకున్నారు. ఆయనకు వ్యతిరేకంగా దిగువ సభలో విపక్షాలు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడుతున్న నేపథ్యంలో, ఆయన దాన్నుంచి గట్టెక్కగలరా అంటే సమాధానం చెప్పలేని పరిస్థితి నెలకొంది. సైన్యం కూడా సాయం చేసేందుకు నిరాకరించిన నేపథ్యంలో, ఇమ్రాన్ ఖాన్ రేపు ఏంచేస్తారన్నది సర్వత్రా ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో, ఓ సభలో ఇమ్రాన్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. 

ఖైబర్ పక్తుంక్వా ప్రాంతంలో ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, రాజీనామా చేసేందుకు వెనుకాడబోనని, అయితే ప్రతిపక్షాల ఒత్తిడికి తలొగ్గి నిర్ణయం తీసుకోనని స్పష్టం చేశారు. అంతేకాదు, సైన్యానికి ముడుపులు ముట్టజెప్పి ప్రభుత్వాన్ని నిలబెట్టుకోలేనని అన్నారు. భారత్ సైన్యం ఎంతో గొప్పదని, ప్రభుత్వ వ్యవహారాల్లో ఏమాత్రం జోక్యం చేసుకోదని అన్నారు. ఆపద వేళ సాయం చేయని పాక్ సైన్యంపై అక్కసును ఈవిధంగా వెళ్లగక్కారు.

పదవీ గండం భయపెడుతున్న నేపథ్యంలో, మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్న ఇమ్రాన్... పనిలోపనిగా పాక్ సైన్యంపై చేసిన పరోక్ష వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. దిగువ సభలో అవిశ్వాస తీర్మానం నేపథ్యంలో తనకు సాయం చేయాలంటూ సైనిక జనరళ్లను కలవగా, వారు సాయం నిరాకరించారంటూ కథనాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో సైన్యానికి డబ్బులు ఇవ్వలేనంటూ ఇమ్రాన్ వ్యాఖ్యానించడం పాక్ రాజకీయాల్లో సైన్యం పాత్రను తేటతెల్లం చేస్తున్నాయి.

Imran Khan
Army
Parliament
Pakistan
  • Loading...

More Telugu News