Syria: రష్యా ఓకే అంటే.. ఉక్రెయిన్ కు యుద్ధమంటే ఏంటో చూపిస్తాం: సిరియా దళాల ప్రకటన
- రష్యాకు మద్దతుగా యుద్ధం చేస్తామని వెల్లడి
- ఉక్రెయిన్ లో వీధి పోరాటాలు చేస్తామని ప్రకటన
- ఎవరూ కనీవినీ ఎరుగని రీతిలో యుద్ధ తంత్రాలు అమలు చేస్తామని కామెంట్
రష్యాకు మద్దతుగా ఉక్రెయిన్ లో యుద్ధం చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని సిరియా దళాలు ప్రకటించాయి. రష్యా అధ్యక్షుడు ఓకే అని ఒక్క మాట చెబితే.. యుద్ధ రంగంలోకి దిగిపోతామని సిరియా పారామిలటరీ బలగాలు తెలిపాయి. సిరియా యుద్ధ సమయంలో రష్యా అందించిన తోడ్పాటుతో పట్టణాల్లో ఫైటింగ్ పై తమకు బాగా మెళకువలు తెలిశాయని, వాటి సాయంతో తాము రష్యాకు అనుకూలంగా యుద్ధం చేస్తామని సిరియా నేషనల్ డిఫెన్స్ ఫోర్సెస్ (ఎన్డీఎఫ్) కమాండర్ నబీల్ అబ్దుల్లా చెప్పారు.
రష్యా చేస్తున్నది సరైనదేనని ఆయన అన్నారు. ఒక్కసారి సిరియా, రష్యా నాయకత్వం ఓకే అన్నాక తాము యుద్ధంలోకి దిగుతామని తెలిపింది. ఈ యుద్ధమంటే తమకు భయం లేదని, ఎలాంటిదానికైనా తాము సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. వాళ్లింత వరకు చూడని, కనీవినీ ఎరుగని రీతిలో యుద్ధమంటే ఏంటో చూపిస్తామని చెప్పారు. ఎవరికీ తెలియని తంత్రాలతో వీధిపోరాటాలు చేస్తామన్నారు. అలాంటి తంత్రాలతోనే ఉగ్రవాదులపై విజయం సాధించామని చెప్పారు.
సిరియా దళాల్లో ఏ సైనికుడిని అడిగినా తాము సిద్ధమేనని అంటున్నారు. మరాదాలోని ఎన్డీఎఫ్ కమాండర్ సైమన్ వకీల్ అనే సైనికుడు కూడా ఇదే విషయం చెప్పారు. రష్యా సోదరుల కోసం పోరాడేందుకు తాము సదా సిద్ధమన్నారు. తమ దేశ ప్రజలు కూడా రష్యాకు అండగా ఉన్నారన్నారు.