International Day of Happiness: ‘హ్యాపీ’గా ఉండాలంటే ఏం చేయాలి..?

International Day of Happiness 2022 Yoga tips to boost overall happiness

  • సానుకూల ధోరణి అలవరచుకోవాలి
  • మానసిక శక్తిని పెంచుకోవాలి
  • అందుకు యోగాసనాలు మంచి మార్గం
  • ప్రాణాయామం, ధ్యాన ప్రక్రియలతోనూ మంచి ఫలితాలు

సానుకూల ధోరణి సంతోషానికి పునాది అని మనస్తత్వ నిపుణుల ఉపదేశం. బావున్నారా..? అంటే బావున్నాం అనే సమాధానం వస్తుంది. కానీ, సంతోషంగా ఉన్నారా? అని మీకు ఎదుట పడిన వారిని ప్రశ్నించండి. అవును అనే సమాధానం వినిపించడం కష్టమే. నేడు ప్రపంచ సంతోష దినం. కనుక ఏ మార్గంలో వెళితే సంతోషాన్ని పట్టుకోవచ్చో నిపుణుల సూచనలు తెలుసుకుందాం.

సంతోషం అంటే జీవితం పట్ల మీరు ఎంత సంతృప్తిగా ఉన్నారన్నదే. ప్రతి రోజును ఎలా చూస్తున్నారన్నదే? కొన్ని సందర్భాలు సంతోషాన్నిస్తే.. కొన్ని బాధకు గురి చేస్తుంటాయి. వాటిని మర్చిపోయి మళ్లీ సంతోషం కోసం మనిషి పోరాటం చేస్తూనే ఉంటాడు. శంకర్ దాదా ఎంబీబీఎస్ సినిమా చూసే ఉంటారు. చిరంజీవిని చూసినప్పుడల్లా పరేష్ రావల్ బీపీ పెరిగిపోతుంటుంది. అయినా నవ్వుతూ దాన్ని అధిగమించే ప్రయత్నం చేస్తుంటాడు. సానుకూలంగా ఉండాలంటే, సంతోషంగా ఉండాలంటే మనసుకు బలాన్ని, రోజువారీ అంశాలను డీల్ చేసే శక్తిని సమకూర్చుకోవాలి.

ప్రతికూల ఆలోచనలు, బాధకు చోటిస్తే హార్మోన్ల సమతుల్యత దెబ్బతింటుంది. రోగ నిరోధక శక్తి బలహీనపడుతుంది. అప్పుడు అలెర్జీలు, అనారోగ్యాలు పలకరిస్తాయి. అందుకనే మనసును సానుకూలత వైపు.. మనో నిబ్బరం, మనోధైర్యంతో నడిపించేందుకు యోగా ఒక మార్గం.

ఆసనాలతో ఫిట్ నెస్ మత్రమే కాదు.. శరీర అంతర్గత అవయవాల పనితీరు మెరుగుపడుతుంది. దీంతో జీవక్రియలు చక్కగా జరుగుతాయి. అది ఆరోగ్యానికి దారితీస్తుంది. శరీరం చక్కగా పనిచేస్తున్నప్పుడు మనసుకు మరింత వెసులుబాటు, సమయం లభిస్తాయి. ఆ సమయాన్ని హ్యాపీనెస్ కోసం కేటాయించుకోవచ్చు. యోగా, ప్రాణాయామం, మెడిటేషన్ ఇవన్నీ మనసును బలంగా చేస్తాయి. వీటితో సానుకూల ధోరణి అలవడుతుంది. 
యోగాతో శారీరక, మానసిక ఆరోగ్యం సాధ్యపడుతుంది. వీటి నుంచి వచ్చే ఫలితమే సంతోషమని నిపుణులు చెబుతారు. పాద హస్తాసన, పశ్చిమోత్తాసన, హలాసన, అధోముఖ స్వనాసన ఇవన్నీ ఎండార్ఫిన్లను విడుదల చేసే ఆసనాలు. శరీరంలో ఒత్తిడి, బాధ నుంచి ఉపశమనం ఇవ్వడానికి ఎండార్ఫిన్లు పనిచేస్తాయి. ఆరంభ ధ్యాన అనే మెడిటేటివ్ ప్రక్రియ కూడా మంచి ఫలితాలను ఇస్తుందని నిపుణులు చెబుతున్నారు.

  • Loading...

More Telugu News