Pakistan: ఇమ్రాన్ ఖాన్ దిగిపోవాల్సిందేనని తేల్చి చెప్పిన పాక్ సైన్యం!
- సాయం కోరితే చేయలేమన్న ఆ దేశ ఆర్మీ చీఫ్
- ఐఎస్ఐ డీజీ నుంచి కూడా అదే రిప్లై
- వారిద్దరితో నిన్న ఇమ్రాన్ ఖాన్ సమావేశం
- రేపే ఆ దేశ దిగువ సభలో అవిశ్వాస తీర్మానం
పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు పదవీ గండం దగ్గరపడిందా? ఆయన దిగిపోవాల్సిన టైం వచ్చేసిందా? అంటే.. అవునన్న సమాధానమే వస్తోంది. రేపు ఆ దేశ దిగువ సభ అయిన నేషనల్ అసెంబ్లీలో ప్రతిపక్ష సభ్యులు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో.. ఇమ్రాన్ ఖాన్ నిన్న పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ ఖనార్ జావెద్ బవా, ఇంటర్ సర్వీస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్ఐ) డీజీ లెఫ్టినెంట్ జనరల్ నదీమ్ అంజుమ్ తో సమావేశమయ్యారు.
అవిశ్వాస తీర్మానం నుంచి గట్టెక్కించాలంటూ ప్రధాని వారిని కోరినా తామేమీ చేయలేమంటూ వారు చేతులెత్తేసినట్టు తెలుస్తోంది. ఒకవేళ అవిశ్వాస తీర్మానంలో ఓడిపోతే దిగిపోవాలంటూ ఇమ్రాన్ కు వారు తేల్చి చెప్పినట్టు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. వాస్తవానికి అంతకుముందు ఇమ్రాన్ ఖాన్ తరఫున.. ఆర్మీ మాజీ చీఫ్ జనరల్ రహీల్ షరీఫ్ తో చర్చలు జరిపేందుకు ప్రయత్నించినా అవీ విఫలమయ్యాయి.
ఆయన జనరల్ బాజ్వాను కలిసినా.. ఇమ్రాన్ కు మద్దతిచ్చేందుకు బాజ్వా వ్యతిరేకించినట్టు సమాచారం. ఉక్రెయిన్ యుద్ధానికి సంబంధించి అమెరికా, యూరోపియన్ యూనియన్ పై అనవసర వ్యాఖ్యలు చేశారంటూ ఇమ్రాన్ పై మండిపడినట్టు సమాచారం. మొత్తంగా పాకిస్థాన్ ఆర్మీ మొత్తం.. ఇమ్రాన్ ఖాన్ ను దించేయాలన్న పట్టుదలతో ఉన్నట్టు తెలుస్తోంది.
ఓఐసీ విదేశీ మంత్రుల కాన్ఫరెన్స్ అయిపోయిన వెంటనే ఇమ్రాన్ దిగిపోవాలని ఆర్మీ చీఫ్ తేల్చి చెప్పినట్టు తెలుస్తోంది. కాగా, ఇప్పటికే సొంత పార్టీ పాకిస్థాన్ తెహ్రీక్ ఈ ఇన్సాఫ్ కే చెందిన 24 మంది నేతలు.. ఇమ్రాన్ కు వ్యతిరేకంగా ఓటేసేందుకు సిద్ధమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇమ్రాన్ దిగిపోవడం ఖాయమన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. అయితే, ఇప్పటికే ఆర్థికంగా ఎంతో సతమతమవుతున్న దేశం.. ఇప్పుడీ రాజకీయ సంక్షోభంతో మరింత దిగజారుతుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది.
కాగా, ఆర్మీ చీఫ్ సాయం చేయకపోవడంతో ఆయన్ను తొలగించాలన్న ఆలోచనలోనూ ఇమ్రాన్ ఖాన్ ఉన్నట్టు సమాచారం.