VH: అశోక హోటల్‌కు చేరుకుని సీనియర్ నేతలకు ఫోన్లు చేస్తోన్న జగ్గారెడ్డి, వీహెచ్
- హోటల్ లో సమావేశం కావాలనుకున్న కాంగ్రెస్ అసంతృప్త నేతలు
- వద్దని చెప్పిన ఏఐసీసీ
- అయినప్పటికీ హోటల్‌కు జగ్గారెడ్డి, వీహెచ్
హైదరాబాద్ లోని హోటల్ అశోకలో కాంగ్రెస్ సీనియర్ నేతలు సమావేశం నిర్వహించాలని తీసుకున్న నిర్ణయం చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తితో ఉన్న నాయకులు ఈ సమావేశంలో పాల్గొనాలని ఇప్పటికే పలువురు నేతలకు ఆహ్వానం పంపారు. అనంతరం ఎల్లుండి ఢిల్లీకి వీహెచ్ వెళ్లి పలు అంశాలపై చర్చించనున్నారు.
ఈ సమావేశంలో పాల్గొనడానికి వీహెచ్‌తో పాటు ఎమ్మెల్యే జగ్గారెడ్డి అశోక హోటల్ కు చేరుకున్నారు. అయితే, ఇతర సీనియర్ నేతలు రాలేదు. అందుకు కారణం ఉంది. ఈ సమావేశం నిర్వహిస్తున్నారని తెలుసుకున్న ఏఐసీసీ ఇది జరగకుండా చర్యలు తీసుకుంది. ఈ సమావేశం ఏర్పాటు చేయకూడదని ఏఐసీసీ కార్యదర్శి బోసురాజు ఆయా నేతలకు ఫోన్లు చేసి చెప్పారు.
ఏవైనా సమస్యలు ఉంటే పార్టీ అధిష్ఠానానికి చెప్పాలని అన్నారు. పార్టీ చేసిన సూచనలు ధిక్కరించకూడదని అన్నారు. అయినప్పటికీ, వీహెచ్, జగ్గారెడ్డి హోటల్‌కు వచ్చారు. అంతేగాక, ఈ సమావేశానికి రావాలని సీనియర్ నేతలకు ఫోన్లు చేసి వారు పిలుస్తున్నారు.