Karnataka: హిజాబ్ పై తీర్పు.. చంపేస్తామంటూ కర్ణాటక హైకోర్టు చీఫ్ జస్టిస్ కు బెదిరింపు
- ఇద్దరి అరెస్ట్.. మరో ఇద్దరిపై కేసు
- తమిళనాడులో అదుపులోకి తీసుకున్న పోలీసులు
- వాకింగ్ కు వెళ్తారు కదా అంటూ నిందితుడి బెదిరింపు
- ఝార్ఖండ్ జడ్జి హత్యను గుర్తు చేస్తూ వార్నింగ్
హిజాబ్ ముస్లిం మతాచారం కాదంటూ సంచలన తీర్పునిచ్చిన కర్ణాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రితూ రాజ్ అవస్థిని చంపేస్తామంటూ దుండగులు బెదిరింపులకు దిగారు. ఆయనతో పాటు ఆ తీర్పులో భాగమైన న్యాయమూర్తులనూ చంపేస్తామంటూ బెదిరింపులకు పాల్పడ్డారు.
ఈ కేసుకు సంబంధించి తమిళనాడుకు చెందిన ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. తిరునల్వేలికి చెందిన తమిళనాడు తాహీద్ జమాత్ (టీఎన్ టీజే) ఆడిటింగ్ కమిటీ మెంబర్ కొవాయి రహ్మతుల్లా, తంజావూరులోని టీఎన్ టీజే మతబోధకుడు ఎస్. జమాల్ మహ్మద్ ఉస్మానీ అనే వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కర్ణాటకలో రేగిన హిజాబ్ వివాదంపై ఈ నెల 15న సీజే సహా ముగ్గురు జడ్జిల ధర్మాసనం తీర్పునిచ్చిన సంగతి తెలిసిందే.
కర్ణాటక హైకోర్టు తీర్పుపై తమిళనాడులో ముస్లిం మత సంస్థలు ఆందోళనలు నిర్వహిస్తున్నాయి. అందులో భాగంగా గురువారం ఒక వీడియో బయటకు లీకైంది. అందులో రహ్మతుల్లా.. ‘‘తప్పుడు తీర్పునిచ్చిన ఝార్ఖండ్ జడ్జి ఉదయం నడకకు వెళ్లి హత్యకు గురైన విషయం గుర్తుందా!’’ అంటూ బెదిరించాడు.
కమ్యూనిటీలో చాలా మంది చాలా కోపంగా ఉన్నారని బెదింపులకు పాల్పడ్డాడు. ఆ ముగ్గురు జడ్జిలకు ఏమైనా జరిగితే తమ మీద నింద మోపేందుకు బీజేపీ సిద్ధంగా ఉందని అన్నాడు. టీన్ టీజే మధురై జిల్లా అధ్యక్షుడు హబీబుల్లా, ఉపాధ్యక్షుడు అసన్ బాద్ షాలపైనా పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా, కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తులతో పాటు ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలపై బెదిరింపు వ్యాఖ్యలు చేయడంతో తంజావూరు టీఎన్ టీజే నేత రజీక్ మహ్మద్ పై కేసు ఫైల్ చేశారు.
కాగా, ఆ వీడియో ఎస్. ఉమాపతి అనే లాయర్ కు చేరడంతో.. హైకోర్టు రిజిస్ట్రార్ కు ఫిర్యాదు చేశారు. ఆ వీడియోలో కర్ణాటక చీఫ్ జస్టిస్ కూడా నడకకు వెళ్తారు కదా అంటూ నిందితుడు బెదిరింపులకు దిగాడన్నారు.