Vladimir Putin: పుతిన్ ప్రసంగిస్తుండగా.. లైవ్ కట్ చేసిన రష్యా అధికార టీవీ ఛానల్
- ఫుట్ బాల్ స్టేడియంలో నిన్న పుతిన్ ప్రసంగం
- ప్రసంగాన్ని కట్ చేసి దేశభక్తి పాటను వినిపించిన ఛానల్
- సాంకేతిక కారణాల వల్ల ఇలా జరిగిందంటూ అధికారిక ప్రకటన
రష్యాలో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. దేశాధ్యక్షుడు పుతిన్ ప్రసంగిస్తుండగా రష్యా అధికారిక టీవీ ఛానల్ లైవ్ ను కట్ చేసింది. వివరాల్లోకి వెళ్తే మాస్కోలోని ప్రధాన ఫుట్ బాల్ స్టేడియంలో వేలాది మంది మద్దతుదారులను ఉద్దేశించి నిన్న పుతిన్ ప్రసంగించారు. అయితే ఆయన ప్రసంగాన్ని మధ్యలో కట్ చేసిన టీవీ ఛానల్... కార్యక్రమం ప్రారంభంలో వినిపించిన దేశభక్తి పాటను వినిపించింది.
'మన అత్యున్నతమైన మిలిటరీ పుట్టినరోజునే ఆపరేషన్ ప్రారంభం కావడం ఎంతో యాదృచ్చికంగా జరిగింది... ' అంటూ ఆయన చెపుతున్న సమయంలో లైవ్ కట్ అయింది. ప్రసంగం స్థానంలో దేశభక్తి గేయాన్ని వినిపించారు. రష్యా అధికారిక టీవీ ఛానల్ ఎంతో పటిష్ఠమైన నియంత్రణలో ఉంటుంది. ఇలాంటి అంతరాయాలు చోటు చేసుకోవడం దాదాపు అసంభవమనే చెప్పాలి. మరోవైపు, ఆ తర్వాత క్రెమ్లిన్ నుంచి అధికారిక ప్రకటన వెలువడింది. సర్వర్ లో తలెత్తిన సాంకేతిక కారణాల వల్లే అంతరాయం ఏర్పడిందని చెప్పింది.
మరోవైపు 10 నిమిషాల అనంతరం పుతిన్ ప్రసంగాన్ని ప్రారంభం నుంచి చివరి వరకు రీప్లే చేశారు. వేదికపై నుంచి ఆయన వెళ్లిపోయేంత వరకు ప్రసారం కొనసాగింది.