Punjab: పంజాబ్ కొత్త కేబినెట్‌లో 10 మంది!.. ఒక్క మహిళకే అవకాశం!
![punja cm mann declares his cabinet ministers](https://imgd.ap7am.com/thumbnail/cr-20220318tn6234943a58219.jpg)
- శనివారం ఉదయం 11 గంటలకు కేబినెట్ ప్రమాణం
- 12.30 గంటలకు తొలి కేబినెట్ సమావేశం
- మంత్రుల జాబితాను ప్రకటించేసిన మాన్
పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఇప్పటికే ఆ రాష్ట్రంలో పాలనా పగ్గాలను చేపట్టింది. మూడు రోజుల క్రితం ఆప్ నేత భగవంత్ మాన్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. అదే రోజున ఆయన సీఎంగా పదవీ బాధ్యతలు కూడా చేపట్టిన సంగతి తెలిసిందే.
తాజాగా తన మంత్రివర్గాన్ని కాసేపటి క్రితం మాన్ ప్రకటించేశారు. మొత్తం 10 మంది సభ్యులతో తన మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించిన మాన్.. వారి వివరాలను కూడా వెల్లడించారు. మాన్ కేబినెట్‌లో ఆయనతో కలిపి మొత్తం 11 మంది ఉండగా.. వారిలో ఒక్క మహిళకు మాత్రమే అవకాశం కల్పించారు. కొత్త మంత్రులు శనివారం ఉదయం 11 గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. రేపు 12.30 గంటలకు మాన్ తన తొలి కేబినెట్ భేటీని నిర్వహించనున్నారు.