Yadadri: ఇక ప్రధాన ఆలయంలోనే యాదాద్రీశ్వరుడి దర్శనం
- 28న ప్రధాన ఆలయంలోకి ఉత్సవ మూర్తులు
- అదే రోజు నుంచి ప్రధాన ఆలయంలోకి భక్తుల అనుమతి
- 28న జరగనున్న సంప్రోక్షణకు సీఎం కేసీఆర్ హాజరు
- యాదాద్రి ఈవో గీతారెడ్డి వెల్లడి
తెలంగాణలో ప్రముఖ ఆలయం యాదగిరిగుట్టలో వెలసిన యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి దర్శనానికి సంబంధించి ఆలయ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 28వ తేదీ నుంచి బాలాలయంలో కాకుండా ప్రధాన ఆలయంలో స్వామివారిని దర్శించుకునేందుకు అనుమతి లభించనుంది. యాదాద్రి స్వామివారి స్వయంభువుల దర్శనాలు ఈ నెల 28న ఉదయం 11.55 గంటలకు నిర్వహించనున్న మహాకుంభ సంప్రోక్షణతో ప్రారంభం అవుతాయని ఆలయ ఈవో గీతారెడ్డి తెలిపారు.
ఈ నెల 21 నుంచి వారం రోజుల పాటు బాలాలయంలో పంచ కుండాత్మక యాగం నిర్వహిస్తామని.. 108 పారాయణ దారులు, ఆలయ అర్చక బృందంతో ఈ క్రతువు ఉంటుందన్న ఈవో.. మహాకుంభ సంప్రోక్షణలో సీఎం కేసీఆర్ పాల్గొంటారని వెల్లడించారు. 21 నుండి 28 వరకు ప్రతి రోజు ఉదయం, సాయంత్రం వేళల్లో బాలాలయంలో పూజా కార్యక్రమాలు ఉంటాయని.. 28వ తేదీన సంప్రోక్షణ అనంతరం బాలాలయంలోని స్వామివారి ఉత్సవ మూర్తులను శోభాయాత్రగా ప్రధానాలయంలోకి తీసుకెళ్లనున్నట్టు తెలిపారు.