Pakistan: సొంత పార్టీ నేతలకే పాక్ ప్రభుత్వం నుంచి కిడ్నాప్ బెదిరింపులు.. తలదాచుకున్న దిగువ సభ సభ్యులు
- సింధ్ హౌస్ లో తలదాచుకున్న వైనం
- ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేసేందుకు 24 మంది సిద్ధం
- మంత్రులు బెదిరింపులకు దిగుతున్నారంటూ ఆందోళన
పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని అధికార పార్టీకి రోజులు దగ్గరపడినట్టే కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఈ నెల 8న ఆ దేశ దిగువ సభ అయిన నేషనల్ అసెంబ్లీలో ప్రతిపక్షం అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. అధికార పార్టీ పాకిస్థాన్ తెహ్రీక్ ఈ ఇన్సాఫ్ (పీటీఐ)లోని 24 మంది ఎంఎన్ఏలు (మెంబర్ ఆఫ్ నేషనల్ అసెంబ్లీ).. సొంత పార్టీకి వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానంలో ఓటేయడానికి సిద్ధమయ్యారు.
అయితే, వారిని కిడ్నాప్ చేస్తామంటూ ప్రభుత్వం నుంచే బెదిరింపులు వస్తున్నట్టు తెలుస్తోంది. దీంతో వారంతా ఇప్పుడు.. ముఖ్యమైన అధికారులు బస చేయడం కోసం కట్టిన సింధ్ హౌస్ లో తలదాచుకున్నట్టు తెలుస్తోంది. కిడ్నాప్ చేస్తామంటూ మంత్రులు తమను బెదిరిస్తున్నారని, అందుకే తాము ఇలా సింధ్ హౌస్ లో తలదాచుకుంటున్నామని ఆ 24 మంది ఎంఎన్ఏలు చెప్పారు.
మరికొందరు మంత్రులు కూడా వచ్చేందుకు సిద్ధమైనా ప్రతిపక్షాలు వారికి వసతి సౌకర్యాలు ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా లేవని చెప్పారు. అయితే, సింధ్ హౌస్ ను నేతల కొనుగోళ్లకు కేంద్రం కాకుండా ఉండేందుకు పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చర్యలు చేపట్టారు. అయినా, కూడా సొంత పార్టీ నేతలే అందులోకి వెళ్లి తలదాచుకుంటున్నారు.