Russia: మీరు టిక్ టాక్ స్టార్ కదూ?.. అంటూ జెలెన్ స్కీకి షాకిచ్చిన బాలిక.. ఇదిగో వీడియో
- తమ్ముడిని కాపాడుకునే క్రమంలో గాయపడిన బాలిక
- వోర్జెల్ పట్టణంలోని ఆసుపత్రిలో చికిత్స
- అదే ఆసుపత్రిలో పేషెంట్లకు జెలెన్ స్కీ పరామర్శ
- చిన్నారి అడిగిన ప్రశ్నకు అవాక్కైన అధ్యక్షుడు
- అవును, టిక్ టాక్ ను ఆక్రమించామంటూ సరదా వ్యాఖ్య
రష్యా ఎన్ని అస్త్రాలు ప్రయోగిస్తున్నా.. క్షిపణులతో విధ్వంసం, వినాశనం సృష్టిస్తున్నా ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్ స్కీ మాత్రం పట్టు జారడం లేదు. దేశం కోసం తుదికంటా పోరాడుతూనే ఉంటామని కరాఖండీగా తేల్చి చెబుతున్నారు. దీంతో అందరితోనూ హీరో అనిపించుకుంటున్నారాయన.
అయితే, రష్యా దాడిలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఓ టీనేజర్ అడిగిన ప్రశ్న మాత్రం ఆయన్ను షాక్ కు గురి చేసింది. నవ్వులు పూయించింది. ఉక్రెయిన్ రాజధాని కీవ్ కు సమీపంలోని వోర్జెల్ పట్టణంలో ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను జెలెన్ స్కీ తాజాగా పరామర్శించారు.
అందరి బాగోగులను అడిగి తెలుసుకున్నారు. ఈ క్రమంలోనే అదే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఓ బాలిక వద్దకు వెళ్లిన ఆయన పుష్పగుచ్ఛం అందజేశారు. అయితే.. ఆ బాలిక మాత్రం ‘‘మీరు టిక్ టాక్ స్టార్ కదా! మీకు చాలా మంది టిక్ టాక్ లో మద్దతిస్తున్నారు. అందరూ మీ గురించే మాట్లాడుకుంటున్నారు. ప్రతి విషయం మీ గురించే’’ అంటూ చెప్పింది. ఆ అమ్మాయిని కాత్యా వెలషెంకోగా గుర్తించారు.
ఆ అమ్మాయి మాటలను సరదాగా తీసుకున్న జెలెన్ స్కీ.. ‘‘అంటే, మేం టిక్ టాక్ ను ఆక్రమించేశామన్నమాట’’ అంటూ నవ్వుతూ కామెంట్ చేశారు.
కాత్యా మాటలు అమాయకంగా అనిపించినా.. ఆ చిన్నారి వీరోచిత సాహసంపై మాట్లాడేందుకు మాత్రం మాటలు సరిపోవు. రష్యా చేసిన దాడి నుంచి తన 8 ఏళ్ల తమ్ముడిని కాపాడుకునేందుకు.. తన ప్రాణాన్నే అడ్డువేసిందా చిన్నారి. రష్యా షెల్స్ తన తమ్ముడికి తగలకుండా దాచేసి.. తాను వాటికి బాధితురాలిగా మారిందని ఉక్రెయిన్ అధ్యక్ష కార్యాలయం ప్రకటించింది. గాయపడిన చిన్నారిని ఆమె తండ్రి చేతుల మీద మోసుకుంటూ ఆసుపత్రికి తీసుకెళ్లారని వివరించింది.