Olga Semidianowa: రష్యా సేనల దాడిలో 'మదర్ హీరోయిన్' మృతి.. ప్రపంచ వ్యాప్తంగా నివాళులు!

Mother Heroine Olga Semidianowa dies in Russian attacks

  • ఉక్రెయిన్ ఆర్మీలో వైద్యురాలిగా సేవలందిస్తున్న ఓల్గా
  • డొనెట్స్క్ సమీపంలో రష్యా సేనలతో పోరాడుతూ వీరమరణం
  • తోటి సైనికులు ఒక్కొక్కరు ప్రాణాలు కోల్పోతున్నా ధైర్యం కోల్పోని ఓల్గా

ఉక్రెయిన్ ని ఆక్రమించుకునే లక్ష్యంతో రష్యా జరుపుతున్న దాడులు ఏమాత్రం తగ్గడం లేదు. ప్రపంచ దేశాలన్నీ యుద్ధం వద్దని ముక్తకంఠంతో కోరుతున్నా రష్యా అధ్యక్షుడు పుతిన్ ఏమాత్రం తగ్గడం లేదు. యుద్ధాన్ని ఆపేయాలంటూ సాక్షాత్తు అంతర్జాతీయ న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలను సైతం ఆయన 'డోంట్ కేర్' అంటున్నాడు. మరోవైపు రష్యా చేస్తున్న భీకర దాడిలో సామాన్యులు పెద్ద సంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్నారు. 

తాజాగా రష్యా బాంబు దాడుల్లో ఉక్రెయిన్ లో 'మదర్ హీరోయిన్'గా పేరుగాంచిన ఓల్గా సెమిడ్యానోవా ప్రాణాలు కోల్పోయారు. ఆమె వయసు 48 ఏళ్లు. వైద్యురాలు కూడా అయిన ఆమె 2014 నుంచి మిలిటరీలో సేవలు అందిస్తున్నారు. ఆమెకు ఆరుగురు సంతానం కాగా... స్థానిక అనాథ శరణాలయం నుంచి మరో ఆరుగురిని దత్తత తీసుకుని పెంచుకుంటున్నారు. దీంతో ఆమె 'మదర్ హీరోయిన్' అనే గౌరవ బిరుదును సొంతం చేసుకున్నారు. ఉక్రెయిన్ లో ఐదుగురు పిల్లల కంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్న వారికి మదర్ హీరోయిన్ అనే బిరుదును ఇస్తారు. 

డొనెట్స్క్ సమీపంలో రష్యా సేనలతో చివరి వరకు పోరాడి ఆమె వీరమరణం పొందారు. తమ యూనిట్ లో ఒక్కొక్కరు ప్రాణాలు కోల్పోతున్నా ధైర్యం కోల్పోని ఆమె చివరి శ్వాస వరకు పోరాడారు. ఆమె పొట్టలోకి తూటా దూసుకుపోవడంతో ఆమె మరణించినట్టు కుటుంబసభ్యులు తెలిపారు. మార్చి 3న ఆమె చనిపోయినట్టు 'కీవ్ ఇండిపెండెంట్' తెలిపింది. అయితే అక్కడ ఇంకా భీకర పోరు జరుగుతుండటంతో మృతదేహాన్ని ఇంకా స్వాధీనం చేసుకోలేకపోయారు. ఆమె మరణ వార్త వెలుగులోకి వచ్చిన వెంటనే ప్రపంచ వ్యాప్తంగా ఆమెకు నివాళులు అర్పిస్తున్నారు.

  • Loading...

More Telugu News