Vladimir Putin: పుతిన్ పోగేసిన రూ.15 లక్షల కోట్ల సంపద కోసం వేటాడుతున్న అమెరికా, మిత్రదేశాలు!
- ఉక్రెయిన్ పై రష్యా దాడులు
- రష్యాపై అత్యంత కఠిన ఆంక్షలు
- పుతిన్ బినామీ ఆస్తులే లక్ష్యంగా పాశ్చాత్య దేశాల చర్యలు
- ఇంగ్లండ్ లో ఉంటున్న పుతిన్ కుమార్తెలు
- వారి పేరుమీద భారీగా ఆస్తులు
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ రాజకీయనేత మాత్రమే కాదు, ప్రపంచ కుబేరుల్లో ఒకరు! ఆయన సంపద మొత్తం విలువ కొన్ని ప్రపంచదేశాల వార్షిక బడ్జెట్ కంటే ఎక్కువగా ఉంటుంది అంటే అతిశయోక్తి కాదు. పుతిన్ ఆస్తుల మొత్తం విలువ రూ.15 లక్షల కోట్లు ఉంటుందని ఓ అంతర్జాతీయ మీడియా సంస్థ (మెయిల్ ఆన్ లైన్) సంచలన కథనం వెలువరించింది. ఉక్రెయిన్ పై రష్యా దురాక్రమణ నేపథ్యంలో అమెరికా, పాశ్చాత్య దేశాలు తీవ్ర ఆంక్షలు విధించాయి. ఇప్పటికే పలు దేశాల్లో పుతిన్ అధికారిక ఆస్తులను స్తంభింపజేశాయి.
తాజాగా అమెరికా, మిత్ర దేశాలు పుతిన్ బినామీ ఆస్తులను లక్ష్యంగా చేసుకున్నాయని మెయిల్ ఆన్ లైన్ తన కథనంలో పేర్కొంది. పుతిన్ తన ఆస్తులను కుమార్తెలు, చిన్ననాటి స్నేహితులు, కొందరు కేజీబీ సహచరుల పేరిట భద్రపరిచారని వివరించింది. రష్యా కరెన్సీ రూబుల్ అన్న విషయం తెలిసిందే. రష్యాలో ప్రతి ఒక్క రూబుల్ లో 50 శాతం వాటాను ఆయన తన బినామీల పేర బదలాయిస్తున్నారని మెయిల్ ఆన్ లైన్ వివరించింది. పుతిన్ స్నేహితుడి కుమారుడు, పుతిన్ మేనల్లుడు సైతం 500 మిలియన్ డాలర్ల సంపదను కలిగి ఉండడం గమనార్హం అని పేర్కొంది.
ఈ బినామీ ఆస్తులు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడెక్కడ ఉన్నాయో తెలుసుకుని, స్తంభింపజేసేందుకు వేట మొదలైందని వెల్లడించింది. ప్రస్తుతం బ్రిటన్ లోని పుతిన్ బినామీ ఆస్తులపై ఆ దేశ జాతీయ క్రైమ్ ఏజెన్సీ (ఎన్సీఏ) దర్యాప్తు ప్రారంభించిందని వెల్లడించింది. ఇంగ్లండ్ లోని సర్రే ప్రాంతంలో పుతిన్ కుమార్తెలు నివసిస్తుండగా, వారి పేరు మీద పెద్ద మొత్తంలో ఆస్తులు ఉన్నట్టు ఎన్సీఏ భావిస్తోందని మెయిల్ ఆన్ లైన్ పేర్కొంది.
బినామీల పేరిట విలాసవంతమైన భవనాలు, 700కి పైగా లగ్జరీ కార్లు, 58 విమానాలు ఉన్నట్టు వివరించింది. అంతేకాదు, ప్రపంచవ్యాప్తంగా పుతిన్ కు భవంతులు, కంపెనీలు, వ్యాపారాలు ఉన్నట్టు తెలిపింది. రష్యాలోని అతిపెద్ద చమురు, సహజవాయువు కంపెనీలను వాడుకుని... పుతిన్ తన బినామీ సంస్థల ద్వారా పెద్దఎత్తున ఆస్తులు పోగేసినట్టు మెయిల్ ఆన్ లైన్ ఆరోపించింది. దీనిపై బహిరంగంగా మాట్లాడినందుకే రష్యా విపక్ష నేత అలెక్సీ నావల్నీని జైలుపాలు చేసినట్టు ఆరోపణలు ఉన్నాయని కూడా వివరించింది.