Punjab: కొత్త ఫొటోలు ఓకే, పాత ఫొటో ఎందుకు తొలగించారు?.. పంజాబ్ సీఎంపై బీజేపీ ఫైర్
- పంజాబ్ సీఎం ఛాంబర్‌లో మహారాజా రంజిత్ సింగ్ ఫొటో
- అమరీందర్ సింగ్ హయాంలోనూ కొనసాగిన వైనం
- మాన్ సీఎం కాగానే.. అదృశ్యమైన ఆ ఫొటో
- కొత్తగా భగత్ సింగ్, అంబేద్కర్ చిత్రపటాలు
పంజాబ్ సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టిన మరునాడే ఆప్ నేత భగవంత్ మాన్‌పై బీజేపీ మండిపడింది. సీఎం కార్యాలయంలో చాలా కాలం నుంచి ఉంటూ వస్తున్న మహారాజా రంజిత్ సింగ్ చిత్రాన్ని ఎందుకు తొలగించారని మాన్‌పై బీజేపీ విరుచుకుపడింది. భగవంత్ సీఎం కుర్చీలో కూర్చున్నాక.. సీఎం ఛాంబర్‌లోకి భగత్‌సింగ్, అంబేద్కర్ చిత్ర పటాలు కొత్తగా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అదే సమయంలో అప్పటిదాకా అక్కడ ఉన్న మహారాజా రంజిత్ సింగ్ చిత్రం మాత్రం మాయమైపోయింది.
ఈ కొత్త పద్ధతిపై బీజేపీ పంజాబ్ ప్రధాన కార్యదర్శి సుభాష్ శర్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ అంబేద్కర్, భగత్ సింగ్ ఫొటోలు పెట్టడంపై తమకు ఎలాంటి అభ్యంతరం లేదన్న ఆయన.. మహారాజా రంజిత్ సింగ్ చిత్రాన్ని ఎందుకు తొలగించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై సీఎం వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. అంతకు ముందు పంజాబ్‌కు సీఎంలుగా పనిచేసిన కెప్టెన్ అమరీందర్ సింగ్ సమయంలో ఆఫీసులో రంజిత్ సింగ్ ఫొటో ఉండటం విశేషం.