Nara Lokesh: మేం పెగాసస్ సాఫ్ట్ వేర్ కొనుంటే జగన్ చర్యలు తీసుకోకుండా ఇన్నేళ్లు ఆగేవారా?: నారా లోకేశ్
- టీడీపీ సర్కారు పెగాసస్ కొనుగోలు చేసిందన్న మమత
- మమతకు తప్పుడు సమాచారం వెళ్లి ఉంటుందన్న లోకేశ్
- చంద్రబాబు చట్టవ్యతిరేక పనులు చేయరని స్పష్టీకరణ
గతంలో చంద్రబాబు హయాంలో టీడీపీ ప్రభుత్వం పెగాసస్ సాఫ్ట్ వేర్ ను కొనుగోలు చేసిందని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ వ్యాఖ్యానించడంపై నారా లోకేశ్ స్పందించారు. మేం నిజంగానే పెగాసస్ సాఫ్ట్ వేర్ ను కొనుగోలు చేసి ఉంటే జగన్ ఇలా సీఎంగా ఉండేవారా? అని లోకేశ్ ప్రశ్నించారు. మమతా బెనర్జీ పెగాసస్ సాఫ్ట్ వేర్ అంశంలో టీడీపీ పేరును తీసుకువచ్చారంటే ఆమెకు తప్పుడు సమాచారం వెళ్లుంటుందని అన్నారు.
ప్రభుత్వానికి అనుకూలంగా ఒప్పందం చేసుకునే అవకాశం ఉన్నా, చంద్రబాబు అందుకు దూరంగా ఉన్నారని లోకేశ్ స్పష్టం చేశారు. చట్టవ్యతిరేక పనులకు చంద్రబాబు ఎప్పుడూ దూరంగా ఉంటారని ఉద్ఘాటించారు. ఒకవేళ తాము పెగాసస్ సాఫ్ట్ వేర్ ను కొనుంటే, జగన్ చర్యలు తీసుకోకుండా ఇన్నేళ్లు ఆగేవారా? అని ప్రశ్నించారు.