AAP: వాట్సాప్ ద్వారా అవినీతిపై ఫిర్యాదు.. పంజాబ్ నూతన సీఎం మాన్ కీలక నిర్ణయం
![punjab new cm mann says punjabis will complaint threw wharsapp on corruption](https://imgd.ap7am.com/thumbnail/cr-20220317tn62330f29768d1.jpg)
- సీఎంగా బాధ్యతలు చేపట్టిన మరునాడే మాన్ కీలక నిర్ణయం
- అవినీతిపై పంజాబ్ ప్రజలు సులువుగా ఫిర్యాదు కోసం కొత్త విధానం
- మార్చి 23 నుంచి ఈ విధానం అమలులోకి రానుందని తెలిపిన సీఎం
అవినీతి రహిత పాలనే లక్ష్యంగా రాజకీయ రణరంగంలోకి దిగిన సామాన్యుల పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) తన లక్ష్య సాధనలో దూసుకుపోతోంది. ఆదిలోనే ఢిల్లీలో పాలనా పగ్గాలను చేపట్టిన ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్.. ఢిల్లీలో సుపరిపాలనతో ఆ రాష్ట్రాన్ని అప్పులు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దారు. తాజాగా పంజాబ్‌లో పాలనా పగ్గాలు చేపట్టిన ఆ పార్టీ తనదైన శైలి కొత్త నిర్ణయాలతో సాగుతోంది.
పంజాబ్ సీఎంగా ఆప్ నేత భగవంత్ మాన్ పదవీ బాధ్యతలు చేపట్టిన మరునాడే ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. అవినీతిపై పంజాబ్ ప్రజలు సులువుగా ఫిర్యాదు చేసే దిశగా మాన్ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై అవినీతిపై వాట్సాప్ ద్వారా ఫిర్యాదు చేసేలా మాన్ ఓ సరికొత్త విధానాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు గురువారం ప్రకటించారు. అమర వీరుల దినోత్సవమైన ఈ నెల 23 నుంచి ఈ కొత్త విధానం అమలులోకి రానున్నట్లుగా ఆయన ప్రకటించారు.