china jeeyar: చినజీయర్ స్వామి దిష్టి బొమ్మలను తగులబెట్టాలి: టీఆర్ఎస్ ఎమ్మెల్యే పిలుపు
- వనదేవతలు సమ్మక్క-సారలమ్మలపై చినజీయర్ స్వామి వ్యాఖ్యలు
- టీఆర్ఎస్ నుంచి కూడా స్పందనలు
- ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు ఫైర్
- చినజీయర్ క్షమాపణలు చెప్పాల్సిందేనని డిమాండ్
వన దేవతలు సమ్మక్క-సారలమ్మలపై చినజీయర్ స్వామి చేసిన వ్యాఖ్యలపై వివాదం కొనసాగుతోంది. ఈ విషయంపై టీఆర్ఎస్ నుంచి కూడా స్పందనలు వస్తున్నాయి. ఆ పార్టీ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు, ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు చినజీయర్ స్వామిపై మండిపడుతూ ఓ పోస్ట్ చేశారు. ఆదివాసీల ఆరాధ్య దైవాలు సమ్మక్క-సారలమ్మలను కించపరుస్తూ మాట్లాడిన చినజీయర్ క్షమాపణలు చెప్పాల్సిందేనని ఆయన డిమాండ్ చేశారు.
ఆదివాసీ వనదేవతలైన సమ్మక్క, సారలమ్మలను కోట్లాది మంది ప్రజలు కొలుస్తున్నారని ఆయన చెప్పారు. చినజీయర్ స్వామిలా మోసాలకు పాల్పడడం తమ జాతికి తెలియదని ఆయన తెలిపారు. ఆదివాసీల గుడేలలో చినజీయర్ దిష్టిబొమ్మలను తగులబెట్టాలని ఆయన పిలుపు నిచ్చారు. కాగా, నిన్న కూడా పలు ప్రాంతాల్లో చినజీయర్ దిష్టిబొమ్మలను తగులబెట్టి, హుందాగా మెలగాలని ఆయనపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు.