ICJ: అంతర్జాతీయ న్యాయస్థానంలో రష్యాకు వ్యతిరేకంగా ఓటు వేసిన భారత జడ్జి!
- ఉక్రెయిన్ లో రష్యా నరమేధం జరుపుతోందని అంతర్జాతీయ న్యాయస్థానంలో పిటిషన్
- ఆత్మరక్షణలో భాగంగానే ఇది జరుగుతోందన్న రష్యా
- రష్యా నరమేధానికి పాల్పడుతోందనే ఆధారాలు తమ వద్ద లేవన్న అంతర్జాతీయ న్యాయస్థానం
ఉక్రెయిన్ ను ఆక్రమించుకునేందుకు రష్యా చేస్తున్న యుద్ధం తారస్థాయికి చేరుకుంది. రష్యా భీకర దాడులతో ఉక్రెయిన్ నగరాలు శ్మశానాలుగా మారిపోతున్నాయి. ఎక్కడ చూసినా శిథిలాలే కనిపిస్తున్నాయి. ఈ యుద్ధంలో అమాయకులైన ప్రజలు పెద్ద సంఖ్యలో మరణిస్తున్నారు. లక్షలాది మంది ఉక్రేనియన్లు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని... తమ కుటుంబసభ్యులు, పెంపుడు జంతువులతో కలిసి ఇతర దేశాలకు శరణార్థులుగా వెళ్తున్నారు.
ఓ వైపు ఉక్రెయిన్ తో చర్చలు జరుపుతూనే రష్యా తన దాడిని నిరాటంకంగా కొనసాగిస్తోంది. అమెరికా సహా పలు దేశాలు విధిస్తున్న ఆంక్షలను కూడా రష్యా పట్టించుకోవడం లేదు. తమపై ఆంక్షలు విధించిన దేశాలపై రష్యా కూడా ఆంక్షలు విధిస్తోంది.
ఉక్రెయిన్ మరుభూమిగా మారిన నేపథ్యంలో ఈ అంశం అంతర్జాతీయ న్యాయస్థానానికి వెళ్లింది. ఉక్రెయిన్ గడ్డపై రష్యా నరమేధానికి పాల్పడుతోందనే పిటిషన్ దాఖలైంది. హేగ్ లోని అంతర్జాతీయ న్యాయస్థానం దీనిపై విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా అమెరికాకు చెందిన జడ్జి జోన్ డోనోగ్ మాట్లాడుతూ, ఉక్రెయిన్ పై ఆయుధాలను ప్రయోగించడాన్ని రష్యా తక్షణమే ఆపేయాలని అంతర్జాతీయ న్యాయస్థానాన్ని కోరారు. రష్యా చర్యలు అంతర్జాతీయ చట్టాలను సైతం దెబ్బతీసేలా ఉన్నాయని చెప్పారు.
మరోవైపు యుద్ధానికి సంబంధించి అంతర్జాతీయ న్యాయస్థానంలో జరిగిన ఓటింగ్ లో రష్యాకు వ్యతిరేకంగా ఇండియాకు చెందిన జడ్జి జస్టిస్ దల్వీర్ భండారి ఓటు వేశారు. అయితే జస్టిస్ భండారీ రష్యాకు వ్యతిరేకంగా ఓటు వేయడం, రష్యా-ఉక్రెయిన్ సమస్యపై ఆయన వివరణ ఆధారంగా స్వతంత్ర చర్య అయినప్పటికీ... వివిధ అంతర్జాతీయ వేదికలపై భారతదేశం యొక్క అధికారిక స్థానం భిన్నంగా ఉందనే విషయం గమనార్హం.
ఉక్రెయిన్ లో రష్యా నరమేధం జరుపుతోందనే అంశపై సీజేఐలో విచారణ జరిగింది. అయితే దీనిపై రష్యా స్పందిస్తూ ఆత్మరక్షణలో భాగంగానే ఇది జరుగుతోందని తెలిపింది. విచారణ సందర్భంగా అంతర్జాతీయ న్యాయస్థానం స్పందిస్తూ... ఉక్రెయిన్ భూభాగంలో మారణహోమం జరిగినట్టు రుజువు చేసే సాక్ష్యాలు తమ వద్ద లేవని వెల్లడించింది.