Nagababu: మన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారి మాటలు ఎంతో ఊరట కలిగించాయి: నాగబాబు వ్యంగ్యం

Nagababu satires on CM Jagan over Jangareddygudem deaths

  • జంగారెడ్డిగూడెంలో పర్యటించిన నాగబాబు
  • మృతుల కుటుంబాలకు పరామర్శ
  • సీఎం జగన్ సహజ మరణాలనడం పట్ల ఆశ్చర్యం
  • ముఖ్యమంత్రికి జోహారు అంటూ వ్యాఖ్యలు

టాలీవుడ్ నటుడు, జనసేన పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సభ్యుడు నాగబాబు జంగారెడ్డిగూడెంలో పర్యటించి మృతుల కుటుంబాలను పరామర్శించారు. అనంతరం ట్విట్టర్ లో సీఎం జగన్ ను ఉద్దేశించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. జంగారెడ్డి గూడెంలో జరిగిన దుర్ఘటన గురించి తెలుసుకుని తీవ్ర విషాదానికి గురైన నాకు మన ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారి మాటలు ఎంతో ఊరట కలిగించాయని వ్యంగ్యం ప్రదర్శించారు. 

"డాక్టర్లు, మీడియా, స్థానికుల మాదిరే నేను కూడా మొదట వీటిని కల్తీ సారా మరణాలే అని పరిగణించాను. కానీ మన జగన్ రెడ్డి గారు తన ప్రత్యేక డిక్షనరీ సాయంతో వీటిని సహజ మరణాలుగా ధృవీకరించడంతో ఊపిరి పీల్చుకున్నా. 

అందరూ ఒకే ప్రాంతానికి చెందినవారైనా, అందులో మరణించిన వారందరూ కేవలం మగవాళ్లే అయినా, వీరందరూ తమ కంటిచూపు కోల్పోయి, కడుపులో అవయవాలన్నీ కాలిపోయి ఉన్నా, అందరూ ఒకే విధంగా గంటల వ్యవధిలో హఠాన్మరణానికి గురైనా... ఈ చావులకు, కల్తీ సారాకు ఎటువంటి సంబంధం లేదని, ఇవన్నీ కేవలం సహజ మరణాలుగా నిర్ధారించిన మన ప్రియతమ ముఖ్యమంత్రి గారికి జోహారు! ఇలా ఇంకా ఎంతమంది చనిపోయినా మనం వీటిని కేవలం సహజ మరణాలుగా పరిగణించాల్సి రావడం ఆంధ్రులకు పట్టిన దుస్థితి" అంటూ విమర్శనాత్మకంగా స్పందించారు.

  • Loading...

More Telugu News