AP Assembly Session: అసెంబ్లీలో జగన్ ప్రకటనపై టీడీపీ ఎమ్మెల్యే విమర్శ
- జంగారెడ్డిగూడెం మరణాలపై కొనసాగుతున్న రచ్చ
- అసెంబ్లీలో జగన్ ప్రకటన వ్యక్తిగతమన్న మంత్రి బొత్స
- సభలో వ్యక్తిగత ప్రకటనలు ఎలా చేస్తారంటూ అనగాని మండిపాటు
పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో చోటుచేసుకున్న వరుస మరణాలపై ఏపీ అసెంబ్లీలో అధికార వైసీపీ, విపక్ష టీడీపీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. నాటు సారా వల్లే మరణాలు సంభవించాయని టీడీపీ చెబుతోంటే.. అవన్నీ సాధారణ మరణాలేనని వైసీపీ వాదిస్తున్న సంగతి తెలిసిందే. వైసీపీ వాదనను స్వయంగా సీఎం జగన్ సోమవారం నాటి అసెంబ్లీ సమావేశాల్లో ప్రకటన రూపంలో చదివి వినిపించారు.
దీనిపై టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ స్పందించారు. శాసన సభలో సీఎం హోదాలో జగన్ తప్పుడు ప్రకటన ఎలా చేస్తారని ఆయన ప్రశ్నించారు. జంగారెడ్డిగూడెం మరణాలపై సభలో చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో సోమవారం ఐదుగురు, మంగళవారం 11 మంది టీడీపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశారని అనగాని ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీలో సీఎం చేసిన ప్రకటన వ్యక్తిగతమని మండలిలో బొత్స ప్రకటించారన్న అనగాని.. సభలో ముఖ్యమంత్రి తప్పుడు ప్రకటనలు ఎలా చేస్తారని ప్రశ్నించారు. ఇదంతా చూస్తుంటే.. నియంత పరిపాలన సభలో తలపిస్తోందని అనగాని మండిపడ్డారు.