KCR: బడ్జెట్ సమావేశాల చివరిరోజు: ద్రవ్య వినిమయ బిల్లును ప్రవేశ పెట్టిన సీఎం కేసీఆర్
- బిల్లుపై కొనసాగుతోన్న చర్చ
- ఎఫ్ఆర్ఎంబీ, మార్కెట్ కమిటీల చట్ట సవరణల బిల్లులపై మండలిలో చర్చ
- ఉభయ సభల్లో ప్రశ్నోత్తరాల రద్దు
తెలంగాణ అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ద్రవ్య వినిమయ బిల్లు ప్రవేశ పెట్టారు. అనంతరం దీనిపై చర్చ కొనసాగుతోంది. ఈ సందర్భంగా ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. ఉద్యోగాలను భర్తీ చేస్తామని కేసీఆర్ ప్రకటించడం సంతోషంగా ఉందని తెలిపారు.
ఉద్యోగాల కోసం పోటీ పడుతున్న ఉర్దూ మీడియం విద్యార్థుల కోసం ఉర్దూ స్టడీ సెంటర్లు ఏర్పాటు చేయాలని కోరారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయని తెలిపారు. మరోవైపు, ఎఫ్ఆర్ఎంబీ, మార్కెట్ కమిటీల చట్ట సవరణల బిల్లులపై మండలిలో చర్చ జరగనుంది. అయితే, ఉభయ సభల్లో ప్రశ్నోత్తరాలు రద్దు చేశారు. 2020 మార్చితో ముగిసిన సంవత్సరానికి కాగ్ నివేదికలను రాష్ట్ర ప్రభుత్వం ఉభయ సభల్లో ప్రవేశపెట్టనుంది.
అనంతరం శాసనసభ సమావేశాలు నిరవధికంగా వాయిదా పడే అవకాశాలు ఉన్నాయి. ముందుగా నిర్ణయించిన తేదీల ప్రకారం నేటితో తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ముగియాల్సి ఉంది. అవసరమైతే వాటిని పొడిగించే అవకాశమూ లేకపోలేదు. ఈ నెల 7 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన విషయం తెలిసిందే. అదే రోజు తెలంగాణ వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టారు.