India: 12 నుంచి 14 ఏళ్ల పిల్లలకు వ్యాక్సిన్.. 60 ఏళ్లు పైబడిన వారికి ప్రికాషన్ డోసు.. రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలంటే..!
- 60 ఏళ్లు పైబడిన వారికి రేపటి నుంచి ప్రికాషన్ డోసు
- కోవిన్ పోర్టల్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి
- 5 కోట్ల కోర్బ్ వ్యాక్స్ టీకాలను ఉత్పత్తి చేసిన బయోలాజికల్ ఈ లిమిటెడ్
కరోనా మహమ్మారికి చెక్ పెట్టే క్రమంలో భారత్ రేపు మరో కీలక అడుగు వేస్తోంది. 12 నుంచి 14 ఏళ్ల చిన్నారులకు రేపటి నుంచి భారీ వ్యాక్సినేషన్ కార్యక్రమం మొదలుకాబోతోంది. ఈ వయసు గ్రూప్ పిల్లలకు హైదరాబాద్ కు చెందిన బయోలాజికల్ ఈ లిమిటెడ్ సంస్థ ఉత్పత్తి చేసిన కోర్బ్ వ్యాక్స్ టీకాను వేయనున్నారు.
అధికారిక అంచనాల ప్రకారం దేశ వ్యాప్తంగా 12 నుంచి 14 ఏళ్ల గ్రూప్ పిల్లలు 7.11 కోట్ల మంది ఉన్నారు. బయోలాజికల్ ఈ లిమిటెడ్ ఇప్పటికే 5 కోట్ల డోసుల కోర్బ్ వ్యాక్స్ టీకాలను కేంద్ర ప్రభుత్వానికి అందజేసింది. ఈ టీకాలు ఇప్పటికే రాష్ట్రాలకు పంపిణీ అయ్యాయి.
మరోవైపు, రేపు వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభం కానున్న నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య మంత్రి మన్ సుఖ్ మాండవీయ ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ పిల్లలు సురక్షితంగా ఉంటేనే దేశం సురక్షితంగా ఉంటుందని అన్నారు. 12 నుంచి 14 ఏళ్ల పిల్లలకు రేపటి నుంచి వ్యాక్సినేషన్ ప్రారంభమవుతుందని చెప్పారు. 60 ఏళ్లు పైబడిన వారు ఇప్పుడు ప్రికాషన్ డోసు కూడా వేసుకోవచ్చని తెలిపారు. చిన్న పిల్లలు, 60 ఏళ్లు పైబడిన వారికి కచ్చితంగా వ్యాక్సిన్ వేయించాలని కోరారు.
రిజిస్ట్రేషన్ ఇలా చేసుకోవాలి..
- కోవిన్ పోర్టల్ www.cowin.gov.in లింక్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
- కోవిన్ పోర్టల్ లో 'రిజిస్టర్ / సైన్ ఇన్' క్లిక్ చేయాలి.
- ఆల్రెడీ రిజిస్టర్ మెంబర్ అయినట్టయితే... లాగిన్ అవడానికి కావాల్సిన వివరాలు ఎంటర్ చేయాలి. రిజిస్టర్ మెంబర్ కానట్టయితే కొత్తగా అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి.
- పిల్లలకు ఆధార్ నంబర్ లేదా పాన్ నంబర్ వంటి వాటిని అప్ లోడ్ చేయాలి. ఒకవేళ ఇలాంటి డాక్యుమెంట్లు లేనట్టయితే స్కూల్ ఐడీ కార్డులను అప్ లోడ్ చేయవచ్చు.
- తల్లిదండ్రుల కోవిన్ అకౌంట్ లోనే పిల్లల పేర్లు రిజిస్టర్ చేసుకోవాలి.
- 60 ఏళ్లు పైబడిన వారి విషయానికి వస్తే... వారు రెండో డోసు వేయించుకున్న తేదీ ఆధారంగా ప్రికాషన్ డోసు వేస్తారు. వీరు ఆధార్ నంబర్, పాన్ కార్డ్, పాస్ పోర్టు, డ్రైవింగ్ లైసెన్స్, పెన్షన్ డాక్యుమెంట్ తదితర డాక్యుమెంట్లతో రిజిస్టర్ కావచ్చు.
- కోవిన్ పోర్టల్ లో వివరాలను అప్ లోడ్ చేసిన తర్వాత వెరిఫికేషన్ కోసం ఫోన్ నంబర్ కు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేయాలి.
- వెరిఫికేషన్ పూర్తయిన తర్వాత... వ్యాక్సిన్ వేయించుకోవడానికి మనం స్లాట్ బుక్ చేసుకోవాలి. దీని కోసం మనం ఉంటున్న లొకేషన్, పిన్ కోడ్ వంటి వివరాలను ఎంటర్ చేసి.. 'బుక్ అపాయింట్ మెంట్' ను క్లిక్ చేయాలి. ఆ తర్వాత, మనం తీసుకున్న అపాయింట్ మెంట్ ను బట్టి వ్యాక్సిన్ వేయించుకోవచ్చు.