Hyderabad: హైదరాబాదులో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పని చేస్తున్న యువకుడి అనుమానాస్పద మృతి
- హైదరాబాద్ లో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పని చేస్తున్న మెట్ పల్లి వాసి హరీశ్
- టూవీలర్ బావిలో పడటంతో మృతి
- హరీశ్ మృతిపై అనుమానాలు వ్యక్తం చేసిన తల్లిదండ్రులు
హైదరాబాదులో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పని చేస్తున్న వ్యక్తి అనుమానాస్పద రీతిలో మృతి చెందాడు. జగిత్యాల జిల్లా మెట్ పల్లి మండలం వెల్లుల్ల గ్రామ శివారులోని వ్యవసాయ బావిలో పడి మరణించాడు. స్థానిక ఎస్ఐ సుధాకర్ వెల్లడించిన వివరాల ప్రకారం సాఫ్ట్ వేర్ ఇంజినీర్ బర్ల హరీశ్ (31)ది మెట్ పల్లి. హైదరాబాద్ లో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పని చేస్తున్నాడు. ఏడాదిన్నర క్రితం ఓ యువతిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. వారం క్రితం మెట్ పల్లికి వచ్చాడు. ఆదివారం సాయంత్రం స్నేహితులు ఫోన్ చేశారని ఇంట్లో చెప్పి హరీశ్ బయటకు వెళ్లిపోయాడు.
ఆ తర్వాత, వెల్లుల్ల శివారులో హరీశ్ ప్రయాణిస్తున్న ద్విచక్రవాహనం అదుపుతప్పి బావిలో పడిపోయిందని ఆయన చిన్నాన్న కుమారుడికి స్నేహితులు సమాచారమిచ్చారు. దగ్గర్లో ఉన్న తోటల వద్దకు వెళ్లి తిరిగి వస్తుండగా వాహనం బావిలో పడిపోయిందని వారు తెలిపారు. హరీశ్ బావిలో పడిపోయాడని, వెనుక కూర్చున్న మరో యువకుడు గట్టుపై పడిపోయాడని చెప్పారు. ఆ తర్వాత సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి వెళ్లారు. గజ ఈతగాళ్లతో బావిలో గాలించారు. నిన్న తెల్లవారుజామున హరీశ్ మృతదేహాన్ని వెలికితీశారు.
మరోవైపు హరీశ్ తల వెనుకభాగం, ముక్కు, చెవుల వద్ద రక్తం కారడంతో ఆయన కుటుంబసభ్యులు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు ఇదే విషయంపై వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో, కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. మరో విషయం ఏమిటంటే 12 ఏళ్ల క్రితం హరీశ్ చిన్నాన్న కుమారుడు అభిషేక్ కూడా బావిలో పడి మృతి చెందాడు. అదే రీతిలో హరీశ్ కూడా చనిపోవడంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఒక్కగానొక్క కుమారుడైన హరీశ్ మరణంతో అతని తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదిస్తున్నారు.