Air India: ఎయిరిండియాకు కొత్త బాస్.. ప్రకటించిన టాటా గ్రూప్
- టాటా సన్స్ చైర్మన్ ఎన్.చంద్రశేఖరన్ పేరును ప్రకటించిన టాటా గ్రూప్
- ఇల్కర్ ఐసి వెనక్కి తగ్గిన నేపథ్యంలో కొత్త నియామకం
- ఈ ఏడాది జనవరిలో టాటాల చేతికి వచ్చిన ఎయిరిండియా
ఎయిరిండియాకు కొత్త బాస్ వచ్చేశారు. టాటాసన్స్ చైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్ ఎయిరిండియా చైర్మన్‌గా నియమితులయ్యారు. ఈ మేరకు టాటా గ్రూప్ ప్రకటించింది. ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ అయిన ఎయిరిండియాను ఈ ఏడాది జనవరిలో దక్కించుకున్న టాటా గ్రూప్.. టర్కిష్ ఎయిర్‌లైన్స్ మాజీ సీఈవో ఇల్కర్ ఐసిని సీఈవోగా నియమించింది. అయితే, ఆయన నియామకంపై విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో బాధ్యతలు చేపట్టకముందే ఆయన రాజీనామా చేశారు.
ఈ నేపథ్యంలో టాటాసన్స్ చైర్మన్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న చంద్రశేఖరన్‌ను ఎయిరిండియా కొత్త చైర్మన్‌గా నియమిస్తూ టాటా గ్రూప్ ప్రకటన చేసింది. కాగా, ఎయిరిండియా ప్రైవేటీకరణలో భాగంగా జరిగిన బిడ్డింగులో టాటా సన్స్ అనుబంధ సంస్థ టాలెస్ ప్రైవేట్ లిమిటెడ్ 18 వేల కోట్ల రూపాయలకు ఎయిరిండియాను దక్కించుకుంది. ఫలితంగా 69 సంవత్సరాల తర్వాత ఈ సంస్థ తిరిగి టాటాల చేతికి వచ్చింది.