Karnataka: రేపే హిజాబ్‌పై తీర్పు..కర్ణాటక వ్యాప్తంగా ఆంక్షలు
![leave for schools in dakshina kannada district tomorrow](https://imgd.ap7am.com/thumbnail/cr-20220314tn622f64683c21a.jpg)
- హిజాబ్ వివాదంపై ముగిసిన వాదనలు
- రేపు తీర్పు వెలువరించనున్న కర్ణాటక హైకోర్టు
- దక్షిణ కన్నడ జిల్లాలో రేపు విద్యాలయాలకు సెలవు
- బెంగళూరులో వారం పాటు నిషేధాజ్ఞలు
దేశవ్యాప్తంగా పెద్ద చర్చకే తెరలేపిన హిజాబ్ వివాదంపై రేపు (మంగళవారం) కర్ణాటక హైకోర్టు తీర్పు వెలువరించనున్న సంగతి తెలిసిందే. కోర్టు తీర్పు ఎలా ఉన్నా.. ఇరు వర్గాలను అదుపులో ఉంచడం కోసం అధికార యంత్రాంగం అప్పుడే రంగంలోకి దిగిపోయింది. తీర్పు తర్వాత రాష్ట్రంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ఉండేలా కర్ణాటక అధికారులు ముందుజాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే పలు అంక్షలు అమల్లోకి వచ్చేశాయి.
మరోపక్క, హిజాబ్ వివాదం రేగిన దక్షిణ కన్నడ జిల్లావ్యాప్తంగా మంగళవారం నాడు అన్ని విద్యాలయాలకు సెలవు ప్రకటిస్తూ కలెక్టర్ కాసేపటి క్రితం ఉత్తర్వులు జారీ చేశారు. మంగళవారం జరగనున్న పరీక్షలను కూడా వాయిదా వేసుకోవాలని కలెక్టర్ అన్ని విద్యాలయాలకు ఆదేశాలు జారీ చేశారు.
ఇదిలా ఉంటే..హిజాబ్ వివాదంపై హైకోర్టు తీర్పు నేపథ్యంలో బెంగళూరు పోలీస్ కమిషనర్ కమల్ పంత్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. మంగళవారం (మార్చి 15) నుంచి ఈ నెల 21 వరకు బెంగళూరు నగరంలో నిషేధాజ్ఞలను అమలు చేయనున్నట్లు ఆయన ప్రకటించారు. అంటే... వారం పాటు బెంగళూరు నగరంలో ఎలాంటి సమావేశాలు గానీ, నిరసనలు గానీ, జనం గుమికూడడానికి కానీ అనుమతించబోమని ఆయన ఓ ప్రకటనలో తెలిపారు.