Pawan Kalyan: వైసీపీ నాయకుల ప్రతిజ్ఞ ఇదిగో... అంటూ సెటైర్ల లిస్టు చదివి వినిపించిన పవన్ కల్యాణ్
- ఇప్పటం సభలో వైసీపీ నేతలపై తీవ్రస్థాయిలో పవన్ విమర్శలు
- అశుభంతో వైసీపీ పాలన ప్రారంభమైందని వెల్లడి
- ఇంత నెగెటివ్ మనుషులేంట్రా బాబూ అంటూ వ్యాఖ్యలు
ఇప్పటం గ్రామం వద్ద ఏర్పాటు చేసిన జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభలో పవన్ కల్యాణ్ వైసీపీపై ధ్వజమెత్తారు. వైసీపీ పాలన అశుభంతో ప్రారంభమైందని అన్నారు. ఎవరైనా కొత్తింట్లోకి వెళితే కొబ్బరికాయ కొట్టి, దీపం వెలిగించి శుభం కోరుకుంటామని తెలిపారు. కానీ, వైసీపీ వచ్చీ రావడంతోనే కూల్చివేతతో మొదలుపెట్టిందని, అశుభంతో ప్రారంభించిందని విమర్శించారు.
వైసీపీ నేతలపై తనకేమీ వ్యక్తిగత ద్వేషాలు ఉండవని, వారి విధానాలపైనే తన పోరు అని స్పష్టం చేశారు. 151 సీట్లు గెలిస్తే ఎంత బాగా పరిపాలిస్తారోనని ఆసక్తిగా చూశానని, కానీ ఇసుక పాలసీతోనే వారి నైజం బట్టబయలైందని అన్నారు. ప్రభుత్వ ఇసుక పాలసీ వల్ల 32 నిండు ప్రాణాలు బలయ్యాయని పేర్కొన్నారు.
"అప్పటి నుంచి నిన్న మా సభకు ఆటంకం కలిగించే దాకా చూస్తే ఇంత నెగెటివ్ మనుషులేంట్రా బాబూ, ఇంత విధ్వంసపూరిత ఆలోచనలేంటి అనిపిస్తుంది. అసలు వీళ్లేమనుకుని రాజకీయాల్లోకి వచ్చారో అర్థంకావడంలేదు. పైడిమర్రి సుబ్బారావు గారు రాసిన ప్రతిజ్ఞలో భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు అని ఉంటుంది. మరి వైసీపీ వాళ్లు కూడా ఏదో ఒక ప్రతిజ్ఞ చేసుకోకపోతే ఇంత దరిద్రం చేయరు కదా! వాళ్లు కూడా ఏదో ఒక ప్రతిజ్ఞ చేసుకునే రాజకీయాల్లోకి వచ్చుంటారు.
ఆ ప్రతిజ్ఞ ఎలా ఉంటుందంటే... ఆంధ్రప్రదేశ్ మా సొంత భూమి. ఆంధ్రులందరూ మా బానిసలు. రాజ్యాంగస్ఫూర్తిని తుంగలో తొక్కుతాం. న్యాయవ్యవస్థను లెక్కే చెయ్యం. పోలీసులను ప్రైవేటు సైన్యంగా వాడేస్తాం. ఉద్యోగులను ముప్పుతిప్పలు పెడతాం, మూడు చెరువుల నీళ్లు తాగిస్తాం. నిరుద్యోగులకు మొండిచేయి చూపిస్తాం. రాష్ట్ర రహదారులను గుంతలమయం చేస్తాం. ప్రజల వెన్నుపూసలు విరగ్గొడతాం. అలా విరగ్గొట్టేంత వరకు విశ్రమించం.
రాష్ట్రానికి వచ్చే పెట్టుబడుల్లో 50 శాతం వాటా మేం లాక్కుంటాం. చిన్నా పెద్దా తేడా లేకుండా అందరి ఆర్థికమూలాలను దెబ్బకొడతాం. అన్నం పెట్టే రైతన్నకు అండగా ఉంటామని చెబుతాం... కానీ అధికారంలోకి రాగానే వారిని అప్పుల ఊబిలోకి నెట్టేస్తాం, వారు ఆత్మహత్యలు చేసుకుంటామంటే ప్రోత్సహిస్తాం. ఇసుకను అప్పడంలా కరకర నమిలేస్తాం. సహజ వనరులను మొత్తం వాడేసుకుంటాం.
దేవతా విగ్రహాలను ధ్వంసం చేసేవారిని గుండెల్లో పెట్టుకుని కాపాడుకుంటాం. గజం ఖాళీ స్థలం కనిపిస్తే కబ్జా చేసేస్తాం. పార్కులు, స్కూళ్లు, ప్రభుత్వ భవనాలను తాకట్టు పెట్టేస్తాం. సంపూర్ణ మద్యపాన నిషేధం అంటూనే ప్రజలను చిత్తుగా తాగిస్తాం. మా వైసీపీ ఆదాయ వనరులను పెంచుకుంటాం. ఎవడన్నా గొంతెత్తితే... చావగొడతాం, కేసులు పెడతాం, లాఠీలతో చితగ్గొట్టిస్తాం... మా వైసీపీ ఎంపీ అయినాసరే!
ఒక్క చాన్సు.... ఒక్క చాన్సూ... ఒక్క చాన్సిస్తే ఆంధ్రాను పాతికేళ్లు వెనక్కి తీసుకెళతాం. ఇంకొక్క చాన్సిస్తే స్కూలుకెళ్లే చిన్నపిల్లల చేతిలో చాక్లెట్లు లాగేసుకుంటాం... ఇదీ వైసీపీ నేతల ప్రతిజ్ఞ!" అంటూ పవన్ కల్యాణ్ తనదైన శైలిలో సభికులను ఉర్రూతలూగించారు.