Punjab: ఎంపీ ప‌ద‌వికి రాజీనామా చేసిన కాబోయే సీఎం

bhagavanth mann resigns mp seat

  • 2014లో తొలిసారిగా సంగ్రూర్ ఎంపీగా గెలిచిన భ‌గ‌వంత్‌
  • 2019లోనూ అదే స్థానం నుంచి ఎంపీగా విజ‌యం
  • ధురి అసెంబ్లీ నుంచి తాజాగా ఎమ్మెల్యేగా ఎన్నిక‌
  • 16న పంజాబ్ సీఎంగా ప్ర‌మాణం చేయ‌నున్న మాన్‌ 

ఇటీవ‌లే ముగిసిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు సంబంధించి పంజాబ్‌లో గ్రాండ్ విక్ట‌రీ కొట్టిన సామాన్యుడి పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) త్వ‌ర‌లోనే ఆ రాష్ట్రంలో పాల‌నా ప‌గ్గాల‌ను చేప‌ట్ట‌నుంది. ఇప్ప‌టికే ఆ పార్టీ సీఎం అభ్య‌ర్థిగా పోటీ చేసిన ఆప్ ఎంపీ భ‌గ‌వంత్ మాన్ సింగ్‌.. పంజాబ్ గ‌వ‌ర్న‌ర్‌ను క‌లిసి ప్ర‌భుత్వ ఏర్పాటుకు అనుమ‌తించాల‌ని కోరిన సంగ‌తి తెలిసిందే. ఈ నెల 16న భ‌గ‌త్ సింగ్ సొంతూళ్లో భ‌గ‌వంత్ మాన్ పంజాబ్ సీఎంగా ప్ర‌మాణ స్వీకారం చేయ‌నున్నారు.

ఈ దిశ‌గా సీఎం ప్ర‌మాణ స్వీకారోత్స‌వానికి భారీ ఏర్పాట్లు జ‌రుతుండ‌గా.. భ‌గ‌వంత్ మాన్ సింగ్ సోమ‌వారం త‌న ఎంపీ ప‌ద‌వికి రాజీనామా చేశారు. 2014 ఎన్నికల్లో ఆప్ అభ్య‌ర్థిగా సంగ్రూర్ ఎంపీ స్థానం బ‌రిలోకి దిగిన భ‌గ‌వంత్ విక్ట‌రీ సాధించారు. ఆ త‌ర్వాత 2019 ఎన్నికల్లోనూ ఆయ‌న అదే స్థానం నుంచి ఆప్ టికెట్‌పై ఎంపీగా పోటీ చేసి విజ‌యం సాధించారు. ప్ర‌స్తుతం లోక్‌స‌భ స‌భ్యుడిగా ఆయ‌న కొన‌సాగుతున్నారు. 

ఇటీవల పంజాబ్ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో సీఎం అభ్య‌ర్థిగా ఎవరిని ఎంచుకుంటారంటూ ఆప్ క‌న్వీన‌ర్ అర‌వింద్ కేజ్రీవాల్ పెట్టిన పోల్‌లో భ‌గ‌వంత్‌కు మెజారిటీ ప్ర‌జ‌లు ఓటేశారు. దీంతో ఎంపీగా ఉంటూనే భ‌గ‌వంత్... ధురి అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. ఇప్పుడు సీఎంగా ఆయ‌న ప్ర‌మాణ స్వీకారం చేయ‌నున్న నేప‌థ్యంలో ఎంపీ ప‌ద‌వికి రాజీనామా చేశారు. 

  • Loading...

More Telugu News