NSE: జైలుకు చిత్రా రామకృష్ణ... వీఐపీ ట్రీట్మెంట్కు కోర్టు నిరాకరణ
- చిత్రకు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్
- ఇంటి నుంచి భోజనం కుదరదన్న కోర్టు
- హనుమాన్ ఛాలీసాతో జైలుకెళ్లేందుకు మాత్రమే అనుమతి
నేషనల్ స్టాక్ ఎక్చేంజి (ఎన్ఎస్ఈ) మాజీ సీఈఓ చిత్రా రామకృష్ణకు షాక్ ఇస్తూ సీబీఐ ప్రత్యేక కోర్టు సోమవారం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇదివరకే చిత్రకు ముందస్తు బెయిల్‌ను తిరస్కరించిన కోర్టు.. తాజాగా ఆమెను 14 రోజుల పాటు జ్యుడీషియల్ రిమాండుకు తరలిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు సోమవారం చిత్రా తరఫు న్యాయవాది, సీబీఐ న్యాయవాదుల వాదనలు విన్నకోర్టు.. ఆమెను జైలుకు తరలిస్తూ ఆదేశాలు జారీ చేసింది.
ఎన్ఎస్ఈలో కో లొకేషన్ ఆధారంగా జరిగిన కుంభకోణంలో కోట్లాది రూపాయల ప్రజా ధనం దోపిడీకి గురైందన్న ఆరోపణలతో ఇప్పటికే చిత్రాను నాలుగు రోజుల పాటు విచారించిన సీబీఐ.. ఆమె ఇల్లు, కార్యాలయంలోనూ సోదాలు చేసింది. ఈ క్రమంలో సీబీఐ తనను అరెస్ట్ చేసే అవకాశముందన్న భావనతో చిత్ర ముందస్తు బెయిల్ కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను సీబీఐ ప్రత్యేక కోర్టు కొట్టేసిన సంగతి తెలిసిందే.
తాజాగా చిత్రను జ్యుడీషియల్ కస్టడీకి తరలిస్తూ ఆదేశాలు జారీ చేసిన కోర్టు.. జైలులో ఆమెకు వీఐపీ ట్రీట్ మెంట్ ఇప్పించాలంటూ ఆమె తరఫు న్యాయవాది చేసిన విజ్ఞప్తిని తోసిపుచ్చింది. అంతేకాకుండా ఇంటి నుంచి భోజనాన్ని తెప్పించుకునేందుకు కూడా ఆమెకు కోర్టు అనుమతి ఇవ్వలేదు. కేవలం హనుమాన్ ఛాలీసా పుస్తకాన్ని తన వెంట జైలుకు తీసుకువెళ్లేందుకు మాత్రమే కోర్టు ఆమెను అనుమతించింది.