Telangana: ఆ రెండు పార్టీల అధికార దాహానికి బలి అయ్యేది తెలంగాణ ప్రజలే: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
- గతేడాది జనవరిలో తెలంగాణకు ఆయుష్ కేంద్రం
- 14 నెలలుగా స్పందించని తెలంగాణ సర్కారు
- సదరు కేంద్రాన్ని గుజరాత్‌కు కేటాయిస్తూ కేంద్రం నిర్ణయం
- ఆలస్యంగా గుర్తించి స్పందించిన హరీశ్ రావు
- ఫలితం లేదన్న కేంద్ర ప్రభుత్వం
బహుజన సమాజ్ పార్టీ తెలంగాణ కన్వీనర్ హోదాలో మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బహుజన యాత్ర పేరిట మొదలెట్టిన యాత్రలో స్పీడుగా దూసుకెళుతున్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ సర్కారుపై వరుస విమర్శలతో విరుచుకుపడుతున్నారు కూడా.
ప్రభుత్వ పాలనలో కనిపిస్తున్న లోపాలను ఆసరా చేసుకుని ఆయన విమర్శలు గుప్పిస్తున్నారు. ఇందులో భాగంగా తెలంగాణకు అందినట్టే అంది..అందకుండా పోయిన ఆయుష్ వైద్య కేంద్రం గురించి ఆయన ప్రస్తావించారు. ఈ కేంద్రం రాష్ట్రానికి దక్కకపోవడానికి కేసీఆర్ సర్కారు అలవిమాలిన జాప్యమే కారణమని కూడా ప్రవీణ్ సంచలన ఆరోపణ చేశారు.
ఆర్ఎస్ ప్రవీణ్ ఆరోపణల ప్రకారం.. గతేడాది జనవరిలో ఉత్తరప్రదేశ్, గుజరాత్, అసోంలతో పాటు తెలంగాణకు కూడా ఆయూష్ వైద్య కేంద్రాలను కేటాయిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు నాలుగు రాష్ట్రాల సీఎస్‌లకు కేంద్రం నుంచి లేఖలు అందాయి. ఈ లేఖలకు తెలంగాణ మినహా మిగిలిన మూడు రాష్ట్రాలు సకాలంలోనే స్పందించాయి. ఆయుష్ కేంద్రాన్ని దక్కించుకున్నాయి.
అయితే 14 నెలలు గడుస్తున్నా..కేంద్రం లేఖపై అటు సీఎస్ సోమేశ్ కుమార్‌తో పాటు ఇటు సీఎం కేసీఆర్ కూడా స్పందించలేదు. తీరా ఇటీవలే వైద్య, ఆరోగ్య శాఖ బాధ్యతలు చేపట్టిన మంత్రి హరీశ్ రావు స్పందించి వెనువెంటనే కేంద్రానికి లేఖ రాశారు. అయితే అప్పటికే 14 నెలల జాప్యం కారణంగా ఆ కేంద్రాన్ని గుజరాత్‌కు కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నామని, ఇక ఈ విషయంలో తామేమీ చేయలేమని కేంద్రం తేల్చేసిందట.
ఈ విషయంపై ఓ పత్రికలో వచ్చిన కథనాన్ని జత చేసిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.. బీజేపీ, టీఆర్ఎస్ డ్రామా మూలంగా తెలంగాణ కు రావాల్సిన సంప్రదాయ వైద్య కేంద్రం తరలిపోయిందని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఓ ట్వీట్ చేశారు. వేల ఉద్యోగాలు ఇచ్చే ఐటీఐఆర్‌ను ఇప్పటి వరకు స్థాపించనే లేదని..ఆ రెండు పార్టీల అధికార దాహానికి బలి అయ్యేది తెలంగాణ ప్రజలేనంటూ ఆయన విమర్శించారు.