Gutha Sukender Reddy: శాసనమండలి ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన గుత్తా సుఖేందర్‌రెడ్డి
- రెండో సారి మండలి ఛైర్మన్ గా గుత్తా
- ఏకగ్రీవంగా ఎన్నికైన గుత్తా
- అభినందనలు తెలిపిన కేటీఆర్
తెలంగాణ శాసనమండలి ఛైర్మన్ గా టీఆర్ఎస్ ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్ రెడ్డి రెండోసారి పదవీ బాధ్యతలను చేపట్టారు. మండలి ఛైర్మన్ ఎన్నికకు కేవలం గుత్తా నామినేషన్ మాత్రమే రావడంతో ఆయన ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు శాసనమండలి అధికారులు ప్రకటించారు.
రెండోసారి మండలి ఛైర్మన్ అయిన గుత్తా సుఖేందర్ రెడ్డికి మంత్రి కేటీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. కేసీఆర్ సీఎం కావడం, శాసనసభ స్పీకర్ గా పోచారం శ్రీనివాస్ రెడ్డి, మండలి ఛైర్మన్ గా గుత్తా సుఖేందర్ రెడ్డి ఉండటం తెలంగాణకు గర్వకారణమని చెప్పారు. ఎందుకంటే వీరు ముగ్గురూ రైతు బిడ్డలని అన్నారు. రైతు బిడ్డలే అత్యున్నత రాజ్యాంగ పదవుల్లో ఉండటం రాష్ట్ర ప్రజల అదృష్టమని అన్నారు.
కాగా, గుత్తా సుఖేందర్ రెడ్డి కమ్యూనిస్టుగా రాజకీయాల్లోకి అడుగు పెట్టారు. ఆ తర్వాత టీడీపీలో చేరారు. 1999లో టీడీపీ తరపున ఎమ్మెల్యేగా, 2004లో ఎంపీగా గెలుపొందారు. ఆ తర్వాత కాంగ్రెస్ తరపున 2009, 2014లో ఎంపీగా గెలుపొందారు. అనంతరం టీఆర్ఎస్ లో చేరారు. 2019లో ఎమ్మెల్యే కోటాలో టీఆర్ఎస్ ఎమ్మెల్సీగా గెలుపొందారు.