Brother Anil Kumar: బీసీ వ్యక్తిని సీఎం చేయాలన్న డిమాండ్ వస్తోంది: బ్రదర్ అనిల్ కుమార్
- ఉత్తరాంధ్రలో బ్రదర్ అనిల్ పర్యటన
- విశాఖలో వివిధ వర్గాలతో భేటీ
- పలు వర్గాలకు న్యాయం జరగలేదని వెల్లడి
- సాయం కోసం చూస్తున్నారని వివరణ
- జగన్ ను కలిసి రెండున్నరేళ్లయిందన్న అనిల్
ఏపీ సీఎం జగన్ బావ, ప్రముఖ క్రైస్తవ మత ప్రబోధకుడు బ్రదర్ అనిల్ కుమార్ ఇవాళ ఉత్తరాంధ్ర వచ్చారు. విశాఖలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు తగిన న్యాయం జరగడంలేదని అన్నారు. ఎన్నికలకు ముందు వైసీపీ విజయం కోసం కృషి చేసిన సంఘాలు ఇప్పుడు సాయం కోసం ఎదురు చూస్తున్నాయని బ్రదర్ అనిల్ పేర్కొన్నారు. వాళ్ల గోడు వినేందుకే ఉత్తరాంధ్ర వచ్చానని తెలిపారు. దీనిపైన సీఎం జగన్ కు లేఖ రాస్తానని చెప్పారు.
పార్టీ పెట్టాలంటూ అన్ని సంఘాల వారు తనను కోరుతున్నారని, పార్టీ పెట్టడం సామాన్యమైన విషయం కాదని స్పష్టం చేశారు. అది చాలా క్లిష్టమైన విషయం అని, దీనిపై సుదీర్ఘంగా ఆలోచించాల్సి ఉందని అభిప్రాయపడ్డారు.
తన పరిశీలనలో ప్రధానంగా బీసీ వ్యక్తిని సీఎం చేయాలన్న డిమాండ్ వస్తోందని బ్రదర్ అనిల్ పేర్కొన్నారు. దీన్ని కచ్చితంగా నెరవేర్చేందుకు ప్రయత్నిస్తామని అన్నారు. సీఎం జగన్ ను కలిసి రెండున్నరేళ్లయిందని, ఆయన అపాయింట్ మెంట్ కోరడంలేదని వివరింంచారు. బ్రదర్ అనిల్ ఇటీవల విజయవాడలోనూ ఇదే తరహాలో వివిధ సంఘాలతో సమావేశం కావడం తెలిసిందే.