Sonia Gandhi: మళ్లీ సోనియమ్మే.. ఆమె నాయకత్వాన్నే కోరుకున్న సీడబ్ల్యూసీ

CWC Wants Sonia Gandhi as party President

  • సోనియానే అధ్యక్షురాలిగా ఉండాలని సీడబ్ల్యూసీ ఏకగ్రీవ తీర్మానం
  • తమ వల్ల పార్టీకి నష్టం జరుగుతుందంటే త్యాగాలకు సిద్ధమన్న సోనియా
  • సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేయాలని కోరిన నేతలు
  • ఐదు రాష్ట్రాల ఎన్నికల ఓటమిపై లోతుగా చర్చ
  • ఆగస్టు 20న అధ్యక్ష ఎన్నికలు

ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయాన్నిచవిచూసింది. ఈ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో నిన్న సోనియా గాంధీ అధ్యక్షత కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) నాలుగు గంటలకు పైగా సమావేశమైంది. 

ఈ సందర్భంగా ప్రారంభోపన్యాసం చేసిన సోనియాగాంధీ.. గాంధీ కుటుంబం కారణంగా పార్టీ బలహీన పడుతోందన్న అభిప్రాయం చాలామందిలో ఉందని, సభ్యులు కూడా అదే అభిప్రాయంతో ఉంటే త్యాగాలకు తాము సిద్ధంగా ఉన్నామని సోనియా అన్నారు. అయితే, సభ్యులు మాత్రం ఆమె మాటలను కొట్టిపడేశారు. అలాంటిదేమీ లేదని, పార్టీని మీరే నడిపించాలని కోరారు. 

సోనియా నాయకత్వంపై సభ్యులు సంపూర్ణ విశ్వాసం వ్యక్తం చేశారు. సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేసే అధికారాన్ని ఆమెకే కట్టబెట్టారు. సీడబ్ల్యూసీ సమావేశానికి ఈసారి శాశ్వత, ప్రత్యేక ఆహ్వానితుల పేరుతో 57 మందిని ఆహ్వానించారు. అనారోగ్య కారణాలతో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, కరోనా బారినపడిన ఏకే ఆంటోనీ హాజరు కాలేదు. 

రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, కేసీ వేణుగోపాల్, పి.చిదంబరంతోపాటు జీ-23 కూటమిలోని నేతలైన గులాంనబీ ఆజాద్, ఆనంద్ శర్మ, ముకుల్ వాస్నిక్, ఇతర నేతలు పాల్గొన్నారు. సమావేశంలో నేతల అభిప్రాయాలను సోనియా శద్ధగా విన్నారని, చర్చలు ఆరోగ్యకరంగా, నిర్మొహమాటంగా జరిగాయని పార్టీ ప్రధాన కార్యదర్శి రణ్‌దీప్ సింగ్ సూర్జేవాలా తెలిపారు. 

రాహులే పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టాలని ప్రతి కార్యకర్త కోరుకుంటున్నట్టు చెప్పారు. తొలుత సంస్థాగత ఎన్నికలు నిర్వహిస్తామని, ఆగస్టు 20న అధ్యక్ష ఎన్నికలు జరుగుతాయని వివరించారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి వ్యూహలోపమే కారణమని కేసీ వేణుగోపాల్ తెలిపారు. బీజేపీ ప్రజా వ్యతిరేకతను ప్రజల్లోకి సరిగ్గా తీసుకెళ్లలేకపోయామన్నారు. ఈ ఫలితాలు తీవ్ర ఆందోళనకరంగా ఉన్నాయన్నారు. 

2022, 2023 ఎన్నికలతోపాటు 2024 లోక్‌సభ ఎన్నికలను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి పార్టీ పూర్తిస్థాయిలో సమావేశం అవుతుందన్నారు. సోనియా నాయకత్వంపై తమకు పూర్తి విశ్వాసముందని, పార్టీని తొలుత సంస్థాగతంగా బలోపేతం చేయాలని సీడబ్ల్యూసీ ఏకగ్రీవంగా తీర్మానించినట్టు చెప్పారు.

Sonia Gandhi
Congress
CWC
Rahul Gandhi
  • Loading...

More Telugu News